గాంధీ భవన్‌లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి, ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్ మాట్లాడుతూ.. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. పీసీసీ నాయకుల నుంచి పూర్తి మద్దతు లభించిందని తెలిపారు. నాయకుల సహకారంతోనే స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయని అన్నారు. తెలంగాణ పీసీసీ నేతలు ఏర్పాట్లు మంచిగా చేశారని కొనియాడారు. ఉదయం 10కి మొదలైన పోలింగ్, సరిగ్గా నాలుగు గంటలకు ముగిసిందని తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 238 పీసీసీ డెలిగేట్స్, ముగ్గురు ఏఐసీసీ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. మొత్తం 241కి గాను 226 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా సజావుగా పోలింగ్ జరిగిందని తెలిపారు. ఖర్గే తరపున మల్లు రవి, షబ్బీర్ అలీ.. శశి థరూర్ తరుపున శ్రీకాంత్, సంతోష్ లు ఎన్నికల ఎజెంట్లుగా వ్యవహరించగా.. ప్రతినిధుల సంపూర్ణ సహకారంతో స్వేచ్ఛగా పోలింగ్ జరిగినట్లు తెలిపారు. రేపు ఎన్నికల సంఘానికి బ్యాలెట్ బాక్స్ అందజేస్తామని.. 19న అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని తెలిపారు.