బల్మూరి వెంకట్‌పై గాడిద దొంగతనం కేసు
Police Registered Donkey Theft Case Against Balmuri Venkat. ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌పై గాడిద దొంగతనం కేసు నమోదైంది.
By Medi Samrat
ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌పై గాడిద దొంగతనం కేసు నమోదైంది. ఈ మేరకు జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యిందని కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. గాడిదను దొంగతనం చేసి దానిని చిత్రహింసలకు గురి చేసినందుకు ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా నిరసన చేపట్టిన వెంకట్.. గాడిదను దొంగతనం చేసి హింసించారని తమకు ఫిర్యాదు అందిందని ఆ మేరకే కేసు నమోదు చేశాయని డీసీపీ తెలిపారు. ఆ గాడిదను ఎక్కడినుంచి తెచ్చారు?.. యజమాని ఎవరు? అనే వివరాలను వెంకట్ చెప్పడం లేదని తెలిపారు. వెంకట్‌పై యానిమల్స్ యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పట్టణంలో కేసీఆర్ చిత్రపటాన్ని గాడిదకు వేసి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు అదే విధంగా సామాన్య ప్రజలు కెసిఆర్ పాలన వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. ఇది ఏ మాత్రం పట్టనట్టుగా తెరాస నాయకులు కేసీఆర్ పుట్టిన రోజున వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. అందుకే తాము గాడిదకు జన్మదిన వేడుకలు నిర్వహించి.. కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు.