బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్
Police detain Raja Singh for threatening to stall Munawar Faruqui’s show. గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రాజా సింగ్‌ను శుక్రవారం మధ్యాహ్నం
By Medi Samrat
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రాజా సింగ్‌ను శుక్రవారం మధ్యాహ్నం మంగళ్‌హాట్‌లోని ఆయన కార్యాలయం నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మద్దతుదారులలో కొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైద్రాబాద్‌లోని మాదాపూర్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో.. రాజా సింగ్ ప్లాన్ మాదాపూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. రాజాసింగ్ వరుస వీడియోల ద్వారా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశాడు.
శుక్రవారం మధ్యాహ్నం పలువురు పోలీసులు రాజాసింగ్ కార్యాలయానికి వెళ్లారు. ఆయనతో మాట్లాడిన తర్వాత.. పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. అతడిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. రేపు మునావర్ ఫారూఖీ కార్యక్రమం నిర్వహించే వేదిక వద్ద రాజా సింగ్, అతని మద్దతుదారులు గొడవ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందని నివేదికల నేపథ్యంలో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఒక టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజా సింగ్.. రాష్ట్ర ప్రభుత్వం మునావర్ ఫారూఖీ షోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మునావర్ ఫారూఖీ.. రాముడు, సీతకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల ద్వారా హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీశాడు. సమాజం మనోభావాలను గౌరవించేలా ప్రదర్శనను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను' అని అన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులదే బాధ్యత అని రాజాసింగ్ అన్నారు.