ప్లాన్ ప్రకారమే నాగమణి హత్య.. నిందితుడు అరెస్ట్.. పరారీలో మరొకరు..
ఇబ్రహీంపట్నంలోని రాయపోల్ గ్రామంలో సోమవారం జరిగిన పరువు హత్య కేసును పోలీసులు చేధించారు.
By Medi Samrat Published on 3 Dec 2024 8:11 PM ISTఇబ్రహీంపట్నంలోని రాయపోల్ గ్రామంలో సోమవారం జరిగిన పరువు హత్య కేసును పోలీసులు చేధించారు. సొంత అక్కనే హత్య చేసిన నిందితుడు పరమేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కానిస్టేబుల్ నాగమణి సొంత తమ్ముడి చేతిలో హత్యకు గురవడం తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనమైంది. నాగమణి హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. మృతురాలు నాగమణి తల్లిదండ్రులు చనిపోగా.. ఒక అక్క, తమ్ముడు(నిందితుడు) ఉన్నారు.
మొదటి భర్తతో విడాకులు..
నాగమణికి 2014లో పటేల్ గూడాకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.పెళ్లి సమయంలో నాగమణికి కట్నం కింద ఒక ఎకరం భూమిని ఇచ్చారు. కానీ భార్య భర్తల మధ్య విభేదాల కారణంగా ఇద్దరు విడిపోయారు. 2022లో దంపతులు విడాకులు పొందారు. అప్పటినుండి నాగమణి రాయపూర్‌లోని తమ బంధువుల ఇంట్లో తన సోదరుడు పరమేష్‌తో కలిసి ఉంటుంది.
ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న నాగమణి
అదే సమయంలో రాయపోల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ వీరిద్దరి కులాలు వేరు వేరు కావడంతో పెళ్లికి ఆమె సోదరుడు పరమేష్ ఒప్పుకోలేదు. నాగమణిని తమ కులంకు చెందిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఆమె సోదరుడు పరమేశు ఇతర కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. నాగమణికి మొదటి పెళ్లి సమయంలో ఇచ్చిన ఎకరం భూమిని తిరిగి ఇవ్వాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే నాగమణి తన కుటుంబ సభ్యులకు తెలియకుండా శ్రీకాంత్ తో యాదగి రిగుట్టలో నవంబర్ 10వ తేదీన కులాంతర వివాహం చేసుకుంది. దీంతో గ్రామంలో పరువు పోయినట్లుగా భావించిన పరమేష్ అక్కను హతమార్చేందుకు సిద్ధమయ్యాడు.
అక్క కారణంగా తనకు వివాహం కాదని..
మరోవైపు ఈ నవ దంపతులు వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్స్ లో కాపురం పెట్టారు. కులాంతర వివాహం చేసుకుని తమకళ్ళ ముందే నాగమణి దంపతులు తిరుగుతూ ఉండడంతో పరమేష్ పగ పెంచుకున్నాడు. నాగమణి చర్యల వల్ల తనకు వివాహం కాదని కక్ష పెంచుకున్నాడు. దీంతో పరమేష్ ఎలాగైనా నాగమణిని చంపాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఒక కత్తిని కూడా కొనుగోలు చేశాడు.
ప్లాన్ ప్రకారమే హత్య..
నాగమణి గ్రామానికి ఎప్పుడొస్తుందని ఎదురు చూడసాగాడు పరమేష్. ఈ క్రమంలోనే నాగమణి ఆదివారం తన భర్త శ్రీకాంత్‌తో కలిసి రాయపోల్ గ్రామానికి వచ్చింది. విషయం తెలుసుకున్న పరమేష్ ఎలాగైనా సరే నాగమణిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తితో కలిసి ఆమె రాకపోకలు సమాచారం ఇవ్వాలని చెప్పాడు. సోమవారం ఉదయం 8:30 ప్రాంతంలో నాగమణి తన ఎలక్ట్రిక్ బైక్‌పై బయలుదేరిందన్న సమాచారాన్ని శివ.. పరమేష్‌కు చెప్పాడు. దీంతో పరమేష్ అక్క నాగమణిని హత్య చేసేందుకు పక్కా స్కెచ్ వేశాడు. 9 గంటల ప్రాంతంలో మన్నెగూడ గ్రామ సమీపంలో సబ్‌స్టేషన్ దగ్గరకి నాగమణి రాగానే ఆమె స్కూటీని కారుతో ఢీకొట్టాడు. దీంతో నాగమణి ఎగిరి రోడ్డు మీద పడిపోయింది. వెంటనే పరమేష్ కొనుగోలు చేసిన కత్తితో ఒక్కసారిగా ఆమె మెడపై దాడి చేసి.. అతి దారుణంగా హత్య చేశాడు. తీవ్ర గాయాల పాలైన నాగమణి అక్కడికక్కడే చనిపోయింది. నాగమణి భర్త శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి నిందితుల కోసం వేట కొనసాగించారు.
పరారీలో మరో నిందితుడు..
ఈరోజు ఉదయం జనహర్ష వెంచర్ సమీపంలోని పోల్కంపల్లి గ్రామ పరిధిలో పరమేష్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి ఒక కత్తి, మహీంద్రా కారు, ఒక ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరమేష్‌కు వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న శివ కోసం పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.