బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు మునుగోడులో ధర్నాకు దిగారు. గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని కోరుతూ రెండు గంటలకు పైగా ఆయన తన అనుచరులతో కలసి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ధర్నాను ఆపేసి వెళ్లిపోవాలని ఆయనను పోలీసులు అభ్యర్థించారు. అయినప్పటికీ ఆయన కదలకపోవడంతో అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఆయనను తరలిస్తున్న పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఉద్రిక్తత మధ్యే ఆయనను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రాలో స్టేట్ జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు ఇవాళ మధ్యాహ్నం నుండి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 20 మంది రాష్ట్ర జీఎస్టీ అధికారుల బృందం.. సుశీ ఇన్‌ఫ్రాలోని పలు రికార్డ్‌లను తనిఖీ చేస్తున్నట్లు సమాచారం.