జీ20 దేశాల్లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదే : ప్రధాని నరేంద్ర మోదీ
PM Narendra Modi speech in ISB Hyderabad 20th Anniversary.గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ
By తోట వంశీ కుమార్ Published on 26 May 2022 3:55 PM ISTగచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎస్‌బీ 20వ వారికోత్సవ చిహ్నాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఉత్తర ప్రతిభ కనబరిచిన స్కాలర్లకు ఎక్సలెన్స్, లీడర్‌షిప్ అవార్డులు ప్రధానం చేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 2001లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హైదరాబాదులో ఐఎస్‌బీని ప్రారంభించారని గుర్తు చేశారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 వేల మంది నిష్ణాతులుగా పట్టాలు పొందారన్నారు. ఐఎస్‌బీలో చదివిన వారు విదేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారని, అనేక స్టార్టప్‌లను ప్రారంభించారని తెలిపారు. దేశానికి ఐఎస్‌బీ గర్వకారణమన్నారు. ఆసియాలోనే ఐఎస్‌బీ టాప్ బిజినెస్ స్కూల్ అని మోదీ పొగడ్తలు కురిపించారు. దేశ 75 ఏళ్ల స్వాత్రంత్య ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా, రాబోయే 25 ఏళ్లకు కొత్త లక్ష్యాలను ఏర్పరచుకుంటున్నామని మోదీ తెలిపారు. నవభారత నిర్మాణంలో యువత కీలకపాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక జీ20 దేశాల్లో భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇంటర్నెట్ వాడకంలో భారత్ రెండో స్థానంలో, స్టార్టప్స్, రూపకల్పన, వినియోగదారుల మార్కెట్‌లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందన్నారు. కరోనా కారణంగా గొలుసు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధిలో భారత్ పురోభివృద్ధి సాధిస్తోందన్నారు. గతేదాడి భారత్‌కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. నేడు ఇండియా అంటే బిజినెస్ అనేలా పరిస్థితి ఉందన్నారు.
భారత యువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది. మనం చెప్పే పరిష్కారాలను ప్రపంచం అంతా అమలు చేస్తోంది. యువత కోసమే దేశంలో ఎన్నో సంస్కరణలు చేస్తున్నాం. యువతతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
ఐస్‌బీ 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.