రేపు తెలంగాణకు ప్రధాని మోదీ.. బీసీ డిక్లరేషన్ ప్రకటించే ఛాన్స్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

By అంజి  Published on  6 Nov 2023 8:18 AM IST
PM Modi, election campaign, telangana, Telangana Polls

రేపు తెలంగాణకు ప్రధాని మోదీ.. బీసీ డిక్లరేషన్ ప్రకటించే ఛాన్స్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. రేపు భారీ సభను నిర్వహించేందుకు బీజేపీ నాయకత్వం రెడీ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ రేపు సాయంత్రం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుండి నేరుగా ఎల్‌బీ స్టేడియంలో బహిరంగ సభకు హాజరవుతారు.

సభ ముగిసిన అనంతరం ప్రధాని ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు. కాగా రేపు బీజేపీ నిర్వహించే బీసీ గర్జన సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ ప్రతినిధుల బృందం.. ఎప్పటికప్పుడు సభ ఏర్పాట్లను పరిశీలిస్తోంది. ఇటీవల సూర్యాపేట సభలో బీజేపీ అగ్రనేత అమిత్‌షా ప్రసంగిస్తూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీ అభ్యర్థిని సీఎం చేస్తానని చెప్పి, ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపారు. బీసీ ముఖ్యమంత్రి అనే అంశాన్నే బీజేపీ నాయకులు ప్రచార అస్త్రంగా వాడి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణలో మెజారిటీ ఓటర్లు బీసీలు.. వారి ఓట్లను రాబట్టుకునే దిశగా బీజేపీ వ్యహాలు రచిస్తోంది. తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను అన్నీ పార్టీలు కేవలం ఓటు బ్యాంక్ లాగా చూస్తున్నాయని, వారికి రాజ్యాధికారం ఇవ్వాలని బీజేపీకి తప్ప మరే పార్టీకి ఆ ఆలోచన లేదన్న కోణంలో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీసీలకు బీజేపీతోనే రాజ్యాధికారం సాధ్యమని నేతలు ప్రచారాలు చేస్తున్నారు. రేపు హైదరాబాద్‌లో నిర్వహించే బీసీ గర్జన సభలో బిసి డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు సమాచారం. బీజేపీ బిసి డిక్లరేషన్‌లో ఎలాంటి అంశాలు, హామీలు ఉంటాయని బీజేపీతో పాటు ఇటు ప్రత్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Next Story