వందేభారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. తెలుగు ప్రజలకు గొప్ప కానుక
PM Modi virtually flags off Secunderabad-Visakhapatnam Vande Bharat Express train.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును
By తోట వంశీ కుమార్ Published on 15 Jan 2023 1:09 PM ISTతెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదరుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే తొలి సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 10వ నెంబర్ ప్లాట్‌ఫాంపై జరిగిన ప్రారంభ వేడుకల్లో కేంద్ర మంత్రులు అశ్వినీ వైశ్ణవ్, కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ గొప్ప కానుక అని అన్నారు. ఈ రైలు వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందన్నారు. ఎంతో విలువైన సమయం ఆదా అవుతుందన్నారు. పూర్తి దేశీయంగా తయారైన వందేభారత్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అత్యంత వేగంగా గమ్యస్థానాలకు ఈ రైలు చేరుస్తుంది. భద్రతతో పాటుగా రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. 2023లో ప్రారంభిస్తున్న తొలి రైలు ఇది. అని ప్రధాని అన్నారు.
రేపటి (జనవరి 16) నుంచి ప్రజలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు ఈ రైలు నడవనుంది. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే ఈ రైలులో మొత్తం16 భోగీలు ఉంటాయి. ఇందులో రెండు భోగీలు ఎగ్జిక్యూటివ్ కేటగిరీవి. మిగలినవి ఎకానమీ కోచ్‌లు. ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో 104 సీట్లు ఉండగా.. ఎకానమీ క్లాస్‌లో 1,024 సీట్లు ఉంటాయి. ఈ రైలులో మొత్తం 1,128 మంది ఒకేసారి ప్రయాణించవచ్చు. ఈ రైలు 5 స్టేషన్లలో ఆగుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతూ విశాఖ చేరుకుంటుంది.
అయితే.. ఈ ఒక్క రోజు(ఆదివారం) మాత్రం 21 స్టేషన్లలో ఆగనుంది.చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.