ఇవాళ తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ రాక
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జాతీయ పార్టీల తరఫున ప్రచారం చేసేందుకు ప్రముఖ నేతలు వస్తూ ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 7:54 AM ISTఇవాళ తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ రాక
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జాతీయ పార్టీల తరఫున ప్రచారం చేసేందుకు ప్రముఖ నేతలు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు వరుసగా రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. శుక్రవారం కర్ణాటక సీఎం సిద్దరామయ్య కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇక బీజేపీ కూడా కేంద్రమంత్రులతో పాటు ప్రధానిని కూడా రంగంలోకి ఇప్పటికే దించింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇటీవల బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని పాల్గొన్నారు. తాజాగా మరోసారి ఇవాళ తెలంగాణకు ప్రధాని రానున్నారు. శనివారం మాదిగల విశ్వరూప మహాభకు ఆయన హాజరుకానున్నారు.
తొలుత బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ సారి తెలంగాణతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే కమంలో జరుగుతున్న బహిరంగసభకు హాజరవు తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 9 లేదా 10 శాతానికి పెంచే విషయంపైనా మోదీ ఏదైనా ప్రకటన చేయవచ్చునని ఊహాగానాలు సాగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎందుకంటే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇవి సెమీఫైనల్‌లా భావిస్తున్నారు.
రాష్ట్ర జనాభాలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిపి 80 శాతానికి పైగా ఉంటారు. దాంతో.. వీరి మద్దతును కూడగట్టే దిశలో బీజేపీ నాయకత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే శనివారం సాయంత్రం 5 గంటలకు ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న 'మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభ'లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగం చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 5.40 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ బీజేపీ తరఫున ప్రచారంలో భాగంగా ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు. నవంబర్ 26న నిర్మల్‌లో నిర్వహించే సభకు మరోసారి తెలంగాణకు రానున్నారు. అలాగే ప్రచార పర్వం ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో సభకు హాజవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు.