తెలంగాణపై బీజేపీ ఫోకస్, అక్టోబర్‌ 1న పాలమూరుకి మోదీ

అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు తెలిపారు.

By Srikanth Gundamalla  Published on  24 Sept 2023 10:22 AM IST
PM Modi, telangana tour, BJP, mahabubnagar,

తెలంగాణపై బీజేపీ ఫోకస్, అక్టోబర్‌ 1న పాలమూరుకి మోదీ 

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌ ఎన్నికల కోసం వేగంగా ఆలోచిస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాల్లోనూ ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్‌ కూడా లిస్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. బీజేపీ ఇన్నాళ్లు తెలంగాణలో యాక్టివ్‌గా కనిపించింది. కానీ..ఇప్పుడు సైలెంట్‌గా ఉందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ శ్రేణుల్లో ఊపు తెచ్చేందుకు బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చారు. అక్టోబర్ మొదటి వారంలోనే ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఇప్పటికే ఆయన టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది.

అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు తెలిపారు. ప్రధాని మోదీ టూర్‌ గురించి వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు పురపాలికలోని ఐటీఐ మైదానం వేదికగా మధ్యాహ్నం 1 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు.. నిజామాబాద్‌లో కూడా ప్రదాని మోదీ పర్యటన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది అక్టోబర్ 3వ తేదీన నిజామాబాద్‌లో పర్యటిస్తారని సమాచారం. అయితే బహిరంగ సభనా లేక రోడ్‌షో మాత్రమే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. నిజామాబాద్‌ టూర్‌పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

కాగా.. ఈ నెల 28, 29 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తారని ముందుగా అందరూ భావించారు. కానీ.. చివరికి అక్టోబరు 2న ఖరారు చేసినప్పటికీ.. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తూ ఒకటవ తేదీన మహబూబ్‌నగర్‌ సభలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. పాలమూరులో ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. లక్ష మందికి పైగా జనాలను సభకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని మోదీ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని బీజేపీ తెలంగాణ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్ గా ప్రధాని మోదీ ప్రసంగం ఉండే అవకాశం ఉంది. ప్రధాని మోదీ సభ తర్వాత బీజేపీ కూడా అభ్యర్థుల జాబితాను వెల్లడించే ఛాన్స్ ఉంది.

Next Story