రైతుల అకౌంట్లోకి డబ్బుల జమ.. ఎప్పుడంటే?
పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా pmkisan.gov.in లో నమోదు చేసుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది.
By అంజి Published on 20 Jun 2023 7:45 AM ISTరైతుల అకౌంట్లోకి డబ్బుల జమ.. ఎప్పుడంటే?
పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా pmkisan.gov.in లో నమోదు చేసుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 14వ విడత నిధులను జమ చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ నెల చివరి వారంలో రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం కింద రూ.2000 జమ చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై మరో రెండు మూడ్రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదిలా ఉంటే 13 విడతలో వెరిఫికేషన్ కానీ కారణంగా రూ.2 వేలు అందుకోని రైతులకు ఈ సారి రూ.4 వేల చొప్పున అకౌంట్లలో జమ కానున్నాయి. షరతులకు కట్టుబడి ఉన్న రైతులు మాత్రమే ఈ చెల్లింపును అందుకుంటారు. అర్హులైన వ్యక్తులు మాత్రమే పీఎం కిసాన్ యోజన్ ప్రయోజనాలను పొందగలరు. 14 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణంలో తమ భూమిని సాగుచేసే రైతులు మాత్రమే సమ్మాన్ నిధి చెల్లింపులను స్వీకరించగలరు.
రైతు బంధు కూడా
ప్రస్తుత వానాకాలం పంటల కోసం రైతులకు 'రైతు బంధు' పెట్టుబడి పథకం కింద జూన్ 26 నుండి డబ్బు పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, అధికారులను ఆదేశించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. త్వరలో 'పోడు' (బదిలీ సాగు) భూమి 'పట్టాలు' ఇచ్చే రైతులకు 'రైతు బంధు' ప్రయోజనాన్ని వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద సీజన్‌కు ఎకరాకు రూ.5,000 అందజేస్తుంది. కాగా రాష్ట్రంలో ఇప్పటికే రైతులు విత్తనాలు వేసుకోడానికి భూమిని సిద్ధం చేసుకుంటున్నారు. ఇక వానలు పడితే విత్తనాలు పెట్టడమే తరువాయి. అలాగే నార్లు కూడా పోయడం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో రైతుల పెట్టుబడికి ఇబ్బంది కాకూడదని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.