ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ఆయన పాస్‌పోర్టు రద్దు
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న ప్రభాకర్‌రావుకు ఊహించని షాక్ తగిలింది. ఆయన పాస్‌పోర్టు రద్దు చేస్తూ పాస్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు చేసినట్లు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసులో ప్రభాకర్ రావుపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. పాస్ పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు ఆటోమేటిక్ గా క్యాన్సిలేషన్ అవుతుంది. అమెరికా కాన్సులేట్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరో వైపు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ ను పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేసు నమోదు అయిన తర్వాత ఆయన పోలీసులతో ఆడుకున్న ఆటలు.. విచారణకు సహకరించకపోవడాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మాజీ పోలీస్ అధికారి అయిన ఆయన చట్టాన్ని గౌరవించడం లేదని స్పష్టం చేశారు. దీంతో ముందస్తు బెయిల్ పై ఆశలు పెట్టుకోవడం కష్టంగా మారుతోంది. అదే సమయంలో పాస్ పోర్టు రద్దు చేయడంతో డిపోర్టేషన్ తప్ప మరో మార్గం లేదు.ఈ కేసులో కీలకంగా ఉన్న శ్రవణ్ రావును పోలీసులు మరోసారి మంగళవారం ప్రశ్నించారు. ఆయన ఫోన్లతో పాటు ఇతర సాంకేతిక పరికరాల ఆధారాలతో ప్రశ్నించారు. కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది.