ఇండస్ట్రీయల్ కారిడార్‌కు త్వరలోనే అనుమతులు: సీఎం రేవంత్
అపోహలు, అనుమానాలతో ముందుకు వెళితే అభివృద్ధి సాధించలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్బోధించారు.
By అంజి
ఇండస్ట్రీయల్ కారిడార్‌కు త్వరలోనే అనుమతులు: సీఎం రేవంత్
అపోహలు, అనుమానాలతో ముందుకు వెళితే అభివృద్ధి సాధించలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్బోధించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి, పట్టుదల, ఓపిక, సహనం తనకున్నాయని, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, “కొందరు కావాలని సృష్టించే అపోహలు, అనుమానాలకు మరింత ఊతమిస్తే అంతిమంగా వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుంది.
ప్రజలకు ఉపయోగపడే విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో సరైన ప్రణాళికలతో ముందుకొస్తే తప్పకుండా సహకరిస్తాం. దాన్ని ఒక చాలెంజ్‌గా తీసుకుంటాను. పెట్టుబడుల కోసం అమెరికా, జపాన్, కొరియా, దుబాయ్ లాంటి దేశాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ, విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తున్నప్పుడు, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి ఈ నగరం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం పెట్టుబడులతో ముందుకొస్తే మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం.
రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందడానికి హైదరాబాద్‌ను, తెలంగాణను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి మీకున్న ఆలోచనలను పంచుకోండి. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని ఫణంగా పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలకు ఒడిగట్టే ప్రశ్నే లేదు. అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ పాలసీ, మౌలిక సదుపాయాలు.. రెండూ ముఖ్యం. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు చేస్తుంది. ఆ నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. పైగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలా ఉన్నప్పుడే పెట్టుబడులు ఆకర్షించి అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్లగలం.
మౌలిక సదుపాయాలు కల్పించకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ఆరోజు జైపాల్ రెడ్డి గారు మెట్రో రైలు తీసుకురాకపోయి ఉంటే ఈరోజు ఆ సేవలు ఉండేవా. అయితే గడిచిన కొన్నేళ్లుగా మెట్రో విస్తరణ చేపట్టకపోవడం వల్ల నష్టం జరిగింది. మెట్రోను విస్తరించి ఉంటే ఈ ట్రాఫిక్ జామ్ సమస్య కొంతైనా తీరేది. మల్టీ యుటిలిటీ ట్రాన్స్ పోర్టేషన్ ఎప్పుడూ జన సాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఉండాలి. అందుకే మెట్రోను నాగోల్ నుంచి ఎల్బీనగర్ – చాంద్రాయగుట్ట మీదుగా శంషాబాద్ వరకు ప్రతిపాదించాం. మరోవైపు ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు, కూకట్‌పల్లి నుంచి పటాన్‌చెరు వరకు, హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నియోపోలిస్ వరకు విస్తరణ చేపట్టాలని సంకల్పించాం.
ఇండస్ట్రియల్ కారిడార్ అనుమతి ఇవ్వమని కోరాం. తొందరలోనే అనుమతులు రాబోతున్నాయి. ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాల్సింది ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వమే. గ్రాంట్లు, నిధులు, అనుమతులు ఇవ్వాలంటే ఢిల్లీకే వెళ్లాలి. గత పదేళ్ల కాలంలో కంటోన్మెంట్ భూమి ఇంచు కూడా సాధించలేదు. ఎలివేటెడ్ కారిడార్ల కోసం ఢిల్లీకి వెళ్లి అనుమతులు తెచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై 1 లక్ష కోట్ల రూపాయల అప్పు చేశారు. అది కూడా 12 సంవత్సరాల కాలంలో తిరిగి చెల్లించేలా 11.50 శాతం వడ్డీకి అప్పు తెచ్చారు. అంత వడ్డీకి అప్పు చేస్తామా. అప్పు చెల్లిస్తూ ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం 29 వేల కోట్ల రూపాయలు చెల్లించింది.
ఈ విషయంలో ఢిల్లీకి వెళ్లి రుణాలను రీస్ట్రక్చర్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే విజ్ఞప్తి చేశాం. మొదటి దశలో 26 వేల కోట్ల రూపాయల రుణాన్ని 35 సంవత్సరాలకు రీస్ట్రక్చర్ చేయడమే కాకుండా వడ్డీని 7.5 కు తగ్గించాం. ఇదే రకంగా 2 లక్షల కోట్ల రూపాయల రుణాలను రీస్ట్రక్చర్ చేయాలని అడుగుతున్నాం. అప్పులు నెత్తిమీద ఉంటే ఎవరైనా వ్యాపారంలో రాణించగలరా. మెట్రో విస్తరణ కావాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతులు కావాలి. చీటికి మాటికి ఢిల్లీ వెళుతున్నారని కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లకుండా అనుమతులు ఎలా వస్తాయి.
పక్క రాష్ట్రాల్లో ఎన్నో విమానాశ్రయాలు ఉండగా, తెలంగాణలో ఒకే ఒక ఎయిర్‌పోర్టు ఉంది. తెలంగాణకు రెండో ఎయిర్‌పోర్టు అవసరం లేదా. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు రెండింటికీ అనుమతులు తెచ్చాం. పెట్టుబడుల గురించి అడిగినప్పుడు కనెక్టివిటీ గురించి అడుగుతున్నారు. ఎయిర్ పోర్ట్ వస్తే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలొస్తే అభివృద్ధి సాధించగలం. 360 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు రీజినల్ రింగ్ రైల్, డ్రైపోర్టు వంటివి కేంద్రాన్ని అడిగాం. ఓఆర్ఆర్‌కు రీజినల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా 11 రేడియల్ రోడ్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. శాటిలైట్ సిటీలు నిర్మించాలన్న ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం.
విజన్ డాక్యుమెంట్ గమనిస్తే తెలంగాణ సమ్మళిత అభివృద్ధిని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తెలంగాణ అని మూడు ప్రాంతాలుగా రాష్ట్ర సమగ్ర స్వరూపం ఉంటుంది. కోర్ అర్బన్‌లో సర్వీస్ సెక్టర్, సెమీ అర్బన్‌లో ఇండస్ట్రియల్ సెక్టర్, రూరల్‌లో అగ్రికల్చర్ సెక్టర్ ఉంటుంది. ఇలా మూడు రకాలుగా ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నప్పుడు మీ పెట్టుబడులకు ఆ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. హైడ్రా తెచ్చినప్పుడు కూడా కొందరు అపోహలు సృష్టించి అపవాదు వేయడానికి ప్రయత్నించారు. చెరువులు, నాలాలను అక్రమణలను తొలగిస్తే నాకేమైనా సొంత లాభం ఉంటుందా. విజ్ఞతతో ఆలోచించండి.
తెలంగాణ కోసం వేస్తున్న ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మీరే. ఇంకా మెరుగ్గా చేయడానికి సలహాలుంటే ఇవ్వండి. హైదరాబాద్‌ను అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దుతా. భవిష్యత్తులో వందేళ్లు, వెయ్యేళ్లు చెప్పుకునేలా నగరాన్ని అభివృద్ధి చేద్దాం” అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ కార్యవర్గం, ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.