ప్రజా గాయకుడు గద్ధర్ అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఎల్‌బీ స్టేడియంలో వుంచారు. ఆల్వాల్‌లో గద్ధర్ స్థాపించిన మహాబోధి విద్యాలయం గ్రౌండ్‌లో సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించాలని భార్య విమల సూచించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర జరగనుంది. అనంతరం భూదేవి నగర్‌లోని గద్ధర్ స్వగృహంలో కొద్దిసేపు ఆయన పార్ధివదేహాన్ని ఉంచనున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాయకుడు రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తో పాటు ఉద్యమ సంఘాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుని.. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.