మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే.. బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కాసేపటికే టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు పెద్దిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌లోకి రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారని.. 30వ తేదీన టీఆర్ఎస్ పార్టీలో చేరతానని.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించటమే లక్ష్యమని పెద్దిరెడ్డి అన్నారు.
అయితే.. కేసీఆర్ ఆదేశిస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీచేస్తానన్న పెద్దిరెడ్డి.. బీజేపీలో ఉన్న వ్యవస్థ తనకు నచ్చలేదని.. అందుకే పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని అన్నారు. ఏ పదవి ఆశించి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరటం లేదని తెలిపారు. దళితబంధు పథకం హుజూరాబాద్ నుంచి ప్రారంభించటం సంతోషం కలిగించిందన్న ఆయన.. సీఎం కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను.. పేదలకు అందించటానికి వారిధిలా ఉంటాననన్నారు. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి హామీపై కేసీఆర్ నిర్ణయాలకు ప్రజలే ఆమోదం తెలుపుతున్నారని వ్యాఖ్యానించారు.