కర్రెగుట్టల్లో అలజడి..సీఎం రేవంత్‌రెడ్డితో శాంతిచర్చల కమిటీ నేతల భేటీ
శాంతి చర్చల కమిటీ నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik
కర్రెగుట్టల్లో అలజడి..సీఎం రేవంత్‌రెడ్డితో శాంతిచర్చల కమిటీ నేతల భేటీ
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యం కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఈ మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ శాంతి చర్చల కమిటీ నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రిని నేతలు కోరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌కు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న, రవిచందర్ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప.. శాంతి భద్రతల అంశంగా పరిగణించదు. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉంది. ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటాం. మంత్రులతోనూ చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం..అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
కాగా 'ఆపరేషన్ కగార్' పేరుతో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. మూడు రాష్ట్రాల (తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర) సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్ట ప్రాంతం వ్యూహాత్మకంగా మావోయిస్టులకు కీలకమైనది. ప్రస్తుతం సుమారు 20,000 మంది భద్రతా సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా సహా పలువురు కీలక నేతలు ఈ ప్రాంతంలోనే ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. అయితే, భద్రతా బలగాల రాకను ముందుగానే పసిగట్టిన మావోయిస్టులు ఈ సొరంగాన్ని ఖాళీ చేసి వేరే ప్రాంతానికి మకాం మార్చినట్లు తెలుస్తోంది.