కాంగ్రెస్ పార్టీలో పెరిగిన జోష్.. నేతలకు ఘనస్వాగతం
PCC Leaders Visits Nizamabad. పీసీసీ కొత్త కార్యవర్గం నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. అధ్యక్షుడుగా
By Medi Samrat
పీసీసీ కొత్త కార్యవర్గం నియామకం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి నియామకంపై పార్టీలో ముందుగా వ్యతిరేక స్వరం వినిపించినా.. ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిస్థితులు వేరు. అసంతృప్తులుగా ఉన్న ఒకరిద్దరు నేతలు మినహా.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ ఏడేళ్లలో చూడని ఉత్సాహం వచ్చింది. ఇదిలావుంటే.. రేవంత్ తో పాటు కొత్తకమిటీలో ప్రచార కమిటీ చైర్మన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవులు దక్కించుకున్న నిజామాబాద్ నేతలు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మహేష్‌కుమార్ గౌడ్‌కు తొలిసారి జిల్లాలో అడుగుపెట్టారు. ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు పదవులు దక్కడంతో జిల్లా పార్టీలో పుల్ జోష్ వచ్చింది.
దీంతో పదవులు పొందిన తర్వాత ఇద్దరు నేతలు బుధవారం జిల్లాకు వచ్చిన నేతలకు ఘనస్వాగతం పలికారు. ఇందల్వాయి నుంచి నగరంలోని లక్ష్మి కల్యాణ మండపం వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. గతానికి భిన్నంగా వర్గాలతో సంబంధం లేకుండా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు కదులుతుండడం గమనార్హం. భారీ ద్విచక్రవాహనాలు, కార్ల ర్యాలీలతో ముందుకు కదిలారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మారిన తరువాత గత మూడు వారాల్లో మూడుసార్లు చలో హైదరాబాద్ కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. రైతు సమస్యలపై నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. గతంలో పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లా.. భారీగా దెబ్బతిన్న పరిస్థితుల్లో మళ్లీ ప్రజాసమస్యలపై పోరుకు నేతలు కార్యాచరణ రూపొందించి ముందుకు కదిలితే విజయం పక్కా అంటున్నాయి పార్టీ శ్రేణులు.