కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్.. వారాహికి పూజలు పూర్తి
Pawan Kalyan Varahi vehicle Puja in Kondagattu.కొండగట్టు ఆంజనేయ స్వామిని జనసేన అధినేత పవన్ కల్యాణ్
By తోట వంశీ కుమార్ Published on 24 Jan 2023 3:05 PM ISTకొండగట్టు ఆంజనేయ స్వామిని జనసేన అధినేత పవన్ కల్యాన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత జనసేన పార్టీ ప్రచార రథం వారాహి కి అంజన్న సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పూజారులు దగ్గరుండి పవన్‌తో వాహనం ఎదుట సంకల్ప సిద్ది చేయించారు. అనంతరం పవన్ వారాహిని ఎక్కి వాహనాన్ని పరిశీలించిన తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేశారు.
హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 7 గంటలకు పవన్ కల్యాన్ కొండగట్టుకు బయలుదేరారు. ఆయనతో పాటు జనసేన నేతలు, కార్యకర్తలు ఉన్నారు. వాస్తవానికి ఉదయం 11 గంటల వరకే పవన్ కొండగట్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే.. మధ్యలో భారీ ట్రాఫిక్ జామ్‌లో పవన్ కాన్వాయ్ చిక్కుకోవడంతో అనుకున్న సమయానికి కంటే ఆలస్యంగా కొండగట్టుకు చేరుకున్నారు. జనసైనికులు పవన్‌కు ఘన స్వాగతం పలికారు. పవన్‌పై పూల వర్షం కురిపించారు. గజమాలతో సత్కరించారు.వారికి అభివాదం చేస్తూ పవన్ కొండగట్టు ఆంజన్న ఆలయానికి చేరుకున్నారు.
ఆలయంలో వారాహికి పూజలు పూర్తికావడంతో కోడిమ్యాల మండల పరిధిలోని బృందావన్ రిసార్టలో తెలంగాణ జనసేన 32 నియోజకవర్గ కార్యానిర్వహక సభ్యులతో పవన్ సమావేశం కానున్నారు. ఆ తరువాత 3.30 గంటలకు ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ధర్మపురి నుంచి అనుష్టుస్ నారసింగ యాత్రగా 32 క్షేత్రాల సందర్శన యాత్ర ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు పవన్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.