పట్నం మహేందర్ రెడ్డి కుమారుడికి హిమాయత్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో 13 ఎకరాలు : సర్వే

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ గ్రామంలో నిర్వహించిన డిజిటల్‌ సర్వేలో 13 ఎకరాల నిషేధిత భూమి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పీ మహేందర్‌రెడ్డి తనయుడు పీ రినీష్‌రెడ్డి పేరు మీద రిజిస్టర్ అయిందని తేలింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Aug 2024 2:58 PM GMT
పట్నం మహేందర్ రెడ్డి కుమారుడికి హిమాయత్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో 13 ఎకరాలు : సర్వే

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ గ్రామంలో నిర్వహించిన డిజిటల్‌ సర్వేలో 13 ఎకరాల నిషేధిత భూమి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పీ మహేందర్‌రెడ్డి తనయుడు పీ రినీష్‌రెడ్డి పేరు మీద రిజిస్టర్ అయిందని తేలింది. హిమాయత్‌సాగర్‌ తాగునీటి రిజర్వాయర్‌లోని ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌), శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్‌ 14తో సహా నిషేధిత మండలాల్లో గణనీయమైన కబ్జాలు జరిగినట్లు సర్వే వెల్లడించింది. నిషేధిత ప్రాంతంలో కాంపౌండ్‌ వాల్స్‌, రోడ్లు వేయడం, భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి.

సరస్సుల రక్షణలో భాగమైన డాక్టర్ లుబ్నా సర్వత్ సర్వేకు సంబంధించిన కీలక ఫలితాలను పంచుకున్నారు. "మేము 2023, 2021-23, 2019, 2018, 2017, 2012-2016 సంవత్సరాలకు సంబంధించిన HR 1M NRSC ఉపగ్రహ చిత్రాల నుండి సేకరించిన వాటిని కాడాస్ట్రాల్ లేయర్‌తో కప్పాము" అని డాక్టర్ సర్వత్ తెలిపారు. అంతేకాకుండా 2024, 2020 సంవత్సరాలకు సంబంధించి Google Earth కు ఉపగ్రహ చిత్రాలను కూడా అందించామని వివరించారు. వాటిని చూస్తే చాలు ఎంత స్థలాన్ని ఆక్రమించారో ఇట్టే అర్థం అయిపోతుందని తెలిపారు.


డాక్టర్ సర్వత్ HMDA మాస్టర్ ప్లాన్ 2031లో వ్యత్యాసాలను గుర్తించారు. సర్వే నంబర్లు 8, 16 పునరావృతమయ్యాయని బయటపెట్టారు.


కొత్వాల్‌గూడ గ్రామంలోని 14ఏ, 14ఏఏ సర్వే నంబర్లు అసైన్డ్ భూములని కూడా సర్వేలో తేలింది. ఒక ఎకరం జి.కాంతమ్మ పేరు మీద నమోదు కాగా, మిగిలిన 13 ఎకరాలు పి.మహేందర్ రెడ్డి కుమారుడు పి.రినీష్ రెడ్డి పేరిట ఉన్నాయి.


జంట రిజర్వాయర్ల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ ప్రాంతాల నుండి ఆక్రమణలను తొలగించాలని పదేపదే అభ్యర్థనలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని డాక్టర్ సర్వత్ ఆందోళన వ్యక్తం చేశారు.

“ఆక్రమణలను పరిష్కరించడానికి బదులుగా, గత ప్రభుత్వం 2020, 2021 వరదలు వచ్చినప్పుడు విలువైన తాగునీటిని విడుదల చేయడానికి ప్రాధాన్యతనిచ్చింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల పరివాహక ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం ఉంది. కొంతమంది ప్రజాప్రతినిధుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల అవసరాలను పట్టించుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది’’ అని డాక్టర్ సర్వత్ అన్నారు. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ సర్వత్ డిమాండ్ చేశారు.

“ఎఫ్‌టిఎల్ ప్రాంతం, నిషేధిత బఫర్ జోన్‌లోని నిర్మాణాల తొలగింపు చేపట్టాలని మేము అధికారులను అభ్యర్థిస్తున్నాము. మాస్టర్‌ప్లాన్‌ను సరిదిద్దాలి, నిషేధిత జోన్‌లోని అసైన్డ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు డాక్టర్ సర్వత్.

Next Story