సందడిగా టీఎస్ఆర్టీసీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్
హైదరాబాద్ కొండాపూర్ లోని 8వ బెటాలియన్ లో బుధవారం టీఎస్ఆర్టీసీకి చెందిన 80 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందడిగా జరిగింది.
By Medi Samrat Published on 7 Feb 2024 9:40 AM GMTహైదరాబాద్ కొండాపూర్ లోని 8వ బెటాలియన్ లో బుధవారం టీఎస్ఆర్టీసీకి చెందిన 80 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విశిష్ట అతిథిగా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ హాజరయ్యారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల నుంచి వారు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కొత్త కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందజేశారు.
కారుణ్య నియామకం ద్వారా టీఎస్ఆర్టీసీలో ఇటీవల 80 మంది కానిస్టేబుళ్లుగా నియమితులయ్యారు. వారిలో 47 మంది పురుషులు కాగా, 33 మంది మహిళలు ఉన్నారు. హైదరాబాద్ లోని కొండాపూర్ 8వ బెటాలియన్ లో పోలీస్ శాఖ సహకారంతో వీరందరికీ ఒక నెల శిక్షణ ఇవ్వడం జరిగింది. వారంతా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్నారు.
పాసింగ్ ఔట్ పరేడ్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కొత్తగా టీఎస్ఆర్టీసీ కుటుంబంలో చేరబోతున్న కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపారు. నిబద్ధతతో పనిచేస్తూ.. సంస్థ అభివృద్ధికి పాటు పడాలని వారికి సూచించారు. కారుణ్య నియామకాల ద్వారా సర్వీసులో మరణించిన, మెడికల్ అన్ ఫిట్ అయిన సిబ్బంది కుటుంబాలకు సంస్థ భరోసా కల్పిస్తోందనన్నారు.
కారుణ్య నియామకాల కింద 1700 మందికి ఉద్యోగ అవకాశాలను సంస్థ కల్పించిందని తెలిపారు. తాజాగా 813 మందిని నియమిస్తున్నామని, రెండు వారాల్లో నియామక ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. ఎండీ వీసీ సజ్జనర్ ఆధ్వర్యంలో సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకొని 100 శాతం ఆక్యూపెన్సీ దిశగా ముందుకెళ్లడం శుభపరిణామని అన్నారు.
కొత్తగా సంస్థలో చేరుతున్న కానిస్టేబుళ్లకు మేడారం జాతర పెద్ద బాధ్యత ఉందని, నిబద్ధతతో పని చేసి భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని అన్నారు. టీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోందని, ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను దేశానికి తెలియజేసేలా సంస్థను తీర్చిదిద్దుతామని తెలిపారు.
మహాలక్ష్మి పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ త్వరలోనే కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఆ బస్సుల్లో విధులు నిర్వహించడానికి సిబ్బంది రిక్రూట్ మెంట్ కోసం ప్రభుత్వ అనుమతులు కోరామని చెప్పారు.
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మాట్లాడుతూ.. కొత్తగా 80 మంది కానిస్టేబుళ్లు టీఎస్ఆర్టీసీలో చేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందులో దాదాపు సగం 33 మంది మహిళలు ఉండటం శుభపరిణామన్నారు. ఈ కొత్త రక్తంతో సంస్థ మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ఉద్యోగం ఈజీ కాదని, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. సంస్థలోని 50 వేల మంది సిబ్బందిని, బస్సులను కాపాడాల్సిన బాధ్యత తమరిపై ఉందనే విషయం మరచిపోవద్దన్నారు. మహాలక్ష్మి అమల్లోకి వచ్చాక సిబ్బంది నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తూ.. ప్రతి రోజు సగటున 55 లక్షల నుంచి 60 లక్షల మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారని చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని విధులు నిర్వహించాలని కానిస్టేబుళ్లకు సూచించారు.
అతి తక్కువ సమయం ఒక నెలలో సమర్థవంతంగా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చిన టీఎస్ఎస్పీ అదనపు డీజీపీ స్వాతి లక్రా, కొండాపూర్ 8 వ బెటాలియన్ కమాండెంట్ సన్ని బృందానికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.