తెలంగాణ రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌.. నైట్ క‌ర్ఫ్యూ.?

Partial lockdown in telangana state.తెలంగాణ రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్ విధించే దిశగా ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 March 2021 10:42 AM GMT
Partial lockdown in telangana state

గ‌త కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా..? అనే చ‌ర్చ జోరందుకుంది. పెరుగుతున్న క‌రోనా కేసుల‌తో తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. పాఠశాలల మూసివేతకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేసుల సంఖ్య పెర‌గ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది. అందులో భాగంగా.. పాక్షిక లాక్‌డౌన్ విధించే దిశగా ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. అలాగే.. నైట్ కర్ఫ్యూ, రాత్రి పూట లాక్‌డౌన్ విధించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా థియేటర్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనాపై త్వరలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో వీకెండ్స్‌లో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారంలో 3 రోజుల పాటు లాక్‌డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూపై కసరత్తు చేస్తున్నారు. కోవిడ్ అదుపులోనే ఉన్నా.. ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. తెలంగాణలో కేసుల సంఖ్య ఎంత పెరిగినప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 194 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,118 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,645 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,669గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,804 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,123 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 81 మందికి క‌రోనా సోకింది.
Next Story
Share it