సినిమా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలు.. వాటిలో పార్కింగ్‌కు మాత్రం నో ఫీజు.!

Parking fees charged at movie theaters in telangana. తెలంగాణ రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజును వసూలు చేసేందుకు సర్కార్‌ అనుమతి ఇచ్చింది. గతంలో మాల్స్‌, మల్టిప్లెక్స్‌లు, వాణిజ్య

By అంజి  Published on  21 Nov 2021 4:05 AM GMT
సినిమా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలు.. వాటిలో పార్కింగ్‌కు మాత్రం నో ఫీజు.!

తెలంగాణ రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజును వసూలు చేసేందుకు సర్కార్‌ అనుమతి ఇచ్చింది. గతంలో మాల్స్‌, మల్టిప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్‌ ఫీజుల నియంత్రణ కోసం జారీ చేసిన జీవో నెంబర్‌ 63కు సవరణలు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాకు వచ్చిన వారితో పాటు ఇతర పనుల కోసం వచ్చిన వారు థియేటర్లలో తమ వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారని, దీంతో వాటి పార్కింగ్‌, భద్రత తమకు సవాల్‌గా మారిందని థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. పార్కింగ్‌ సిబ్బందికి వేతనాల చెల్లింపు ఆర్థికంగా భారమవుతోందని తెలిపాయి.

తాజాగా ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించింది. సినిమా థియేటర్లలో పార్కింగ్‌ సమస్యను పరిశీలించిన ప్రభుత్వం.. వెంటనే పార్కింగ్‌ ఫీజుకు అనుమతి ఇచ్చింది. అయితే మాల్స్‌, మల్టిప్లెక్స్‌లు, వాణిజ్య సముదాల్లో మాత్రం నో పార్కింగ్‌ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. మూడున్నరేళ్ల క్రితం అక్రమ పార్కింగ్‌ దందాకు చెక్‌ పెట్టేలా.. ఉచిత పార్కింగ్‌కు అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేశారు. 2018, మార్చి 20న పురుపాలక శాఖ జీవో -63ను జారీ చేసి.. థియేటర్లు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ ఫీజు వసూలు చేయొద్దని తెలిపింది.

మొదటి 30 నిమిషాలు కొనుగోళ్లతో సంబంధం లేకుండా మాల్స్‌, మల్టీప్లెక్స్‌లో ఉచిత పార్కింగ్‌కు అవకాశం ఉంటుంది. ఒక వేళ గంట వరకు ఎంత కొనుగోలు చేసినా పార్కింగ్‌ ఫీజు కంటే తక్కువ బిల్లు ఉంటే ఫీజు వసూలు చేయవద్దు. అలాగే గంటకుపైగా వాహనం పార్కింగ్‌ చేసినా.. సినిమా టికెట్‌గాని, కొనుగోలు బిల్లు చూపించినా పార్కింగ్‌ ఫీజు తీసుకోరు. గత మూడున్నరేళ్లుగా ఈ విధానం అమలవుతోంది. అయితే ఈ విధానంలో పలు సవరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సినిమా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలుకు అవకాశం కల్పించింది. మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో మాత్రం నో పార్కింగ్‌ ఫీజు ఉంటుందని తెలిపింది.

Next Story
Share it