చరిత్రాత్మక విజయం సాధిస్తా.. నా గెలుపు రాజకీయ పెను మార్పులకు శ్రీకారం..

Palvai Sravanti who expressed confidence on the win. మునుగోడు ఉప ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తాన‌ని, అది ఎప్పటికీ గుర్తుండిపోతుందని

By Medi Samrat  Published on  29 Oct 2022 1:24 PM GMT
చరిత్రాత్మక విజయం సాధిస్తా.. నా గెలుపు రాజకీయ పెను మార్పులకు శ్రీకారం..

మునుగోడు ఉప ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తాన‌ని, అది ఎప్పటికీ గుర్తుండిపోతుందని కాంగ్రెస్ నాయకురాలు, మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి పాల్వాయి స్ర‌వంతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆమె శనివారం నాడు వివిధ సభలలో ప్రసంగించారు. 'తన ప్రచారం ఇప్పటికే చారిత్రాత్మకంగా మారిందని, ఇద్దరు రాజకీయ దిగ్గజాలు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావులు నాలాంటి సాధారణ మహిళను ఓడించేందుకు పెద్ద ఎత్తున నాయక దళాన్ని మోహరించి తమ వనరులను ఎలా వెచ్చించారో ప్రజలు చూస్తున్నారని అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు భారీగా నగదు, మద్యం పంపిణీలతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అధికారిక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ, కాంగ్రెస్ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికల్లో గెలవడానికి అనైతిక చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు.. తనను ప్రజా సేవకురాలిగా, తమ ప్రతినిధిగా, ఎన్నుకోవాలని అభ్యర్థనతో ఖాళీగా, ముకుళిత హస్తాలతో ఓటర్లను కలుస్తున్నానని అన్నారు.

తన ప్రచారానికి ముఖ్యంగా మహిళలు, యువత నుంచి విశేష స్పందన వస్తోందని స్ర‌వంతి తెలిపారు. మునుగోడు ఓటర్లకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు.. ఈ నియోజకవర్గానికి పలుమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మా నాన్న స్వర్గీయ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డితో కలిసి ప్రచారం చేశాను. మా నాన్న ను కొల్పోయి చాలా బాధతో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నన్ను ఉప ఎన్నికలకు అభ్యర్థిగా ప్రతిపాదించినప్పుడు చాలా సంతోషించాను. టిఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఓటర్లను భారీగా నగదు, మద్యంతో ప్రలోభపెట్టడంతో మొదట్లో నేను ఒకింత భయపడ్డానని.. కానీ మునుగోడు ప్రజలు నాకు ఎన్నడూ లేనంత మద్దతు, ప్రేమను అందించారని సంతోషం వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో ప్రతి కుటుంబం నన్ను తమ‌ కూతురిలా చూసుకుందని.. అందుకే మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ-టీఆర్‌ఎస్‌ కూటమికి మునుగోడు బిడ్డకు మధ్య జరుగుతున్న పోరాటం అని ఆమె అన్నారు.

బంగారు తెలంగాణగా మారుస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మద్యం విక్రయాలను పెంచి 'మద్యం తెలంగాణ'గా మార్చాడని.. తెలంగాణలో ముఖ్యంగా యువతలో మద్యం వినియోగం అధిక రెట్లు పెరిగి వేలాది కుటుంబాలను నాశనం చేసిందని ఆమె అన్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ మాఫియాను అరికట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. కానీ వేలాది మంది యువతను మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మార్చిందని దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పరిస్థితి మారుతుందని ఆమె అన్నారు.

తన గెలుపు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తుందని స్ర‌వంతి అన్నారు. 'నేను గెలిస్తే మహిళలకు అవకాశం దొరికితే రాజకీయ దిగ్గజాలతో పోరాడి ఓడించగలరని రుజువవుతుందని, టీఆర్‌ఎస్‌, బీజేపీల దురహంకారానికి అడ్డుకట్ట పడుతుందని, తమ ప్రభుత్వాలు తాము ఇచ్చిన వాగ్దానాలను నెర‌వేరుస్తారని అన్నారు.

టీఆర్‌ఎస్, బీజేపీల వ్యూహాలతో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, చివరి దశలో అనేక ఆఫర్లతో ప్రజలను ఆకర్షిస్తారని కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని స్ర‌వంతి ధీమా వ్యక్తం చేశారు.


Next Story