ప్రధాని మోదీ 'ముజ్రా' వ్యాఖ్యలపై.. అసదుద్దీన్ ఆగ్రహం
ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి ‘ముజ్రా’ చేస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 27 May 2024 8:07 AM ISTముస్లిం ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి ‘ముజ్రా’ చేస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విమర్శలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను దోచేసి ముస్లింలకు మళ్లించేందుకు ఇండియా కూటమి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ముజ్రా వ్యాఖ్యలపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా 'డిస్కో', 'భాంగ్రా', 'భరత నాట్యం' వంటి ఇతర నృత్య రూపాల రూపకాలను ఉపయోగిస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ బీహార్‌లోని పాట్లీపుత్ర లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు 'ముజ్రా' ప్రదర్శిస్తున్నట్లు ప్రధాని ప్రతిపక్ష పార్టీలపై అభియోగాలు మోపారని ముందు రోజు అదే ప్రాంతంలో మోదీ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. “ప్రధానమంత్రి ఉపయోగించాల్సిన భాష ఇదేనా?" అని అసదుద్దీన్ అన్నారు. దాదాపు 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనీయులు స్వాధీనం చేసుకున్నారు. ఆ విషయంలో ప్రధాని మోదీ చేసిందేమీ లేదు. ఆయన ఈ సమస్యపై డిస్కో డ్యాన్స్ చేస్తున్నారా అని నేను అడగాలనుకుంటున్నానన్నారు అసదుద్దీన్. పౌరసత్వ (సవరణ) చట్టం ముస్లింల ఓటు హక్కును రద్దు చేయడానికి తీసుకువచ్చింది.. మోదీ ఈ అంశంపై భాంగ్రా చేస్తూనే ఉన్నారని అసదుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. అలాగే, ధర్మ్ సంసద్ (హిందూ సమ్మేళనాలు)లో ముస్లింల గురించి, ముఖ్యంగా తల్లులు, సోదరీమణుల గురించి అన్ని రకాల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.. కానీ మోదీ ఈ అంశంపై భరతనాట్యం చేస్తూ సంతృప్తి చెందారని అసదుద్దీన్ ఆరోపించారు.