కోటి జాతీయ జెండాలు.. తెలంగాణలో ఇంటింటికీ పంపిణీ

Over 1 crore national flags ready for distribution to households in Telangana. తెలంగాణలో ప్రతి ఇంటికి ఆగస్టు 8 నుంచి 22 వరకు జరగనున్న 'స్వతంత్ర భారత వజ్రోత్సవాలు'లో భాగంగా

By అంజి  Published on  31 July 2022 6:09 AM GMT
కోటి జాతీయ జెండాలు.. తెలంగాణలో ఇంటింటికీ పంపిణీ

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రతి ఇంటికి ఆగస్టు 8 నుంచి 22 వరకు జరగనున్న 'స్వతంత్ర భారత వజ్రోత్సవాలు'లో భాగంగా రాష్ట్రంలోని ఇంటింటికీ ఒకటి చొప్పున కోటి జాతీయ జెండాలు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. ఈ జెండాలను అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో పంపిణీ చేయనున్నారు. జాతీయ సమైక్యత, దేశభక్తిపై చిత్రాలను ప్రదర్శిస్తామని, అన్ని థియేటర్లలో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సినిమాలను చూసేందుకు అనుమతిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 'స్వతంత్ర భారత వజ్రోత్సవాలు' ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఉన్నతాధికారులతో సీఎస్‌ 'స్వతంత్ర భారత వజ్రోత్సవాలు' ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఉన్నత స్థాయి వజ్రోత్సవ కమిటీ ఇప్పటికే ఒక వివరణాత్మక కార్యక్రమ షెడ్యూల్‌ను రూపొందించింది. ఆగస్టు 8న ప్రారంభోత్సవ సభ జరగనుండగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ సమైక్యతపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ సూచించిన విషయం తెలిసిందే. ఆగస్టు 8న సీఎం హెచ్‌ఐసీసీలోని హైటెక్స్‌ వేదికపై వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ వేడుకలను మన స్వాతంత్య్రానికి స్ఫూర్తినిచ్చిన అత్యున్నత ఆదర్శాలు, దేశభక్తి స్ఫూర్తిని హైలైట్ చేసేలా నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో చేసిన త్యాగాల గురించి ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించేందుకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు.

Next Story