జోగులాంబ గద్వాల జిల్లా లోని ధరూర్ మండలం భీంపురం గ్రామంలో వందేళ్ల నాటి పురాతన లాకర్ బయటపడింది. సోమవారం సాయంత్రం పల్లె ప్రగతిలో భాగంగా పాత ఇంటిని తొలగిస్తుండగా వందేళ్ల నాటి లాకర్ లభ్యమైంది. ఆ లాకర్ లో నిధులు ఉంటాయేమోనని ఊహాగానాలు రావడంతో పోలీసులు రెవెన్యూ అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి లాకర్‌ను భద్రపరిచారు.
సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు లాకర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఉన్న బీసీ కమ్యూనిటీ హాల్ లో లాకర్‌ను భద్ర పరిచారు. మండల రెవెన్యూ అధికారి హరికృష్ణ, ధరూర్ ఎస్సై రాములు పంచాయతీ సెక్రెటరీ మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ , రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో లాకర్ ను వెల్డింగ్ కట్టర్ సహాయంతో సుమారు నాలుగు గంటలు కష్టపడి శ్రమించి లాకర్ను ఓపెన్ చేశారు.
తీరా చూస్తే అప్పటి కాలానికి సంబంధించిన ఒక గుడ్డలో తుప్పు పట్టిన దస్తావేజులు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకుని అక్కడికి పెద్ద ఎత్తున గ్రామస్తులు చేరుకొన్నారు. లాకర్‌లో బంగారం లాంటివి ఏవీ లేకపోవడంతో అంతా నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఆ ఇంటికి సంబంధించిన వారసులు మాట్లాడుతూ గతంలో మా పూర్వీకులు ఆ లాకర్ లో తమ వ్యాపార వ్యవహారాల కోసం సంబంధించిన పత్రాలను భద్రపరుస్తూ ఉండేవారని చెప్పుకొచ్చారు.