హైదరాబాద్: ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని అమ్ముకుంటే చర్యలు తప్పవని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్న వారికి రెవెన్యూ అధికారులు షాక్ ఇస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటే రేషన్ కార్డులు రద్దు చేస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం నాడు మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని ఆచలాపూర్ గ్రామంలో 11 రేషన్ కార్డులను రద్దు చేశారు. లబ్ధిదారులు కిలోకి రూ.16 చొప్పున 1.91 క్వింటాళ్ల బియ్యాన్ని మహేశ్ అనే వ్యక్తికి విక్రయించినట్టు గుర్తించారు.
బియ్యం అమ్మిన, కొన్న వారిపై చర్యలు తప్పవని తహశీల్దార్ హెచ్చరించారు. రేషన్ బియ్యం అమ్మినవారితోపాటు కొన్నవారిపైనా కేసులు నమోదుచేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1న ‘ఉచిత సన్న బియ్యం పథకం’ ప్రారంభించింది. రేషన్ షాపుల (ప్రజా పంపిణీ కేంద్రాలు) ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందజేస్తున్నారు. రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోంది.