ఇన్ కం ట్యాక్స్ అధికారుల సోదాల తర్వాత టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తొలిసారి స్పందించారు. తానొక్కడిపై ఐటీ సోదాలు జరగలేదని, ఇండస్ట్రీ మొత్తం జరిగాయని స్పష్టం చేశారు. తమపై తప్పుడు వార్తలు రాయవద్దని మీడియా సమావేశం సందర్భంగా మాట్లాడారు. 2008లో ఒకసారి తమపై ఇన్ కం ట్యాక్స్ దాడి జరిగిందన్న ఆయన, ప్రస్తుతం 16 సంవత్సరాల తర్వాత మరోసారి సోదాలు చేశారని అన్నారు. తమ కుటుంబం మొత్తంపై కూడా సోదాలు చేశారని, తనకు సంబంధించిన కార్యాలయాల్లో నిన్ననే సోదాలు ముగించినట్లు చెప్పారు. తన దగ్గర డబ్బు, ఆస్తుల పత్రాలు ఏమీ దొరకలేదన్న దిల్ రాజు చెప్పారు. ఇదంతా ప్రాసెస్‌లో భాగమన్న ఆయన, ఎలాంటి హడావడి లేదని క్లారిటీ ఇచ్చారు.
కుటుంబం మొత్తంలో రూ.20 లక్షలు మాత్రమే ఐటీ అధికారులు గుర్తించారని దిల్ రాజ్ చెప్పారు. తన దగ్గర రూ.5 లక్షలు, తన కూతురి నివాసంలో రూ.6 లక్షలు లభించినట్లు చెప్పారు. ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదని దిల్ రాజు వెల్లడించారు. తమ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఐటీ అధికారులు తీసుకున్నట్లు చెప్పారు. ఇక తన తల్లి అస్వస్థతకు గురవ్వడంపై కూడా దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. లంగ్ ఇన్‌ఫెక్షన్ కోసం చికిత్స తీసుకున్నారని స్పష్టం చేశారు. ఐటీ సోదాలు, తన తల్లి అనారోగ్యానికి ముడి పెట్టవద్దని కోరారు. ఫిబ్రవరి 3వ తేదీన మరోసారి కలవాలని ఐటీ అధికారులు చెప్పారని, తన ఆడిటర్స్ కలుస్తారని దిల్ రాజు చెప్పారు.