బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌ను సీజ్ చేసిన టీఎస్‌ఆర్‌టీసీ
2.51 కోట్ల లీజు బకాయిలు చెల్లించనందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిజామాబాద్ జిల్లాలోని జీవన్ రెడ్డి మాల్, మల్టీప్లెక్స్‌ను సీజ్ చేసింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 May 2024 12:15 PM IST2.51 కోట్ల లీజు బకాయిలు చెల్లించనందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిజామాబాద్ జిల్లాలోని జీవన్ రెడ్డి మాల్, మల్టీప్లెక్స్‌ను సీజ్ చేసింది. ఈ ఆస్తులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డికి చెందినది.
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు బకాయిలు చెల్లించకపోవడంతో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో టీఎస్‌ఆర్టీసీ లీజు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీకి చెందిన దాదాపు 7,059 చదరపు గజాల స్థలాన్ని విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్‌లకు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) కింద జూన్ 1, 2013న 33 ఏళ్లపాటు లీజుకు ఇచ్చారు.
2017లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భార్య రజితారెడ్డి విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్వాధీనం చేసుకుని షాపింగ్ మాల్‌కు జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ అని పేరు పెట్టారు. అందులోని స్టాళ్లను థర్డ్ పార్టీలకు లీజుకు ఇచ్చారు. జీవన్ రెడ్డి కుటుంబం ఒప్పందం ప్రకారం.. టీఎస్‌ఆర్టీసీకి సకాలంలో అద్దె చెల్లించలేదు. అక్టోబర్ 2023 వరకు జీవన్ రెడ్డి కుటుంబం TSRTCకి 8.65 కోట్ల రూపాయలు బకాయిపడింది.
నోటీసులు అందించిన తర్వాత జీవన్ రెడ్డి కుటుంబం 2023 అక్టోబర్‌లో రూ.1.50 కోట్లు చెల్లించింది. షోకాజ్ నోటీసులు పంపిన తర్వాత 2023 డిసెంబర్‌లో రూ.2.40 కోట్లు వాయిదాల పద్ధతిలో చెల్లించారు. షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ జీవన్ రెడ్డి కుటుంబం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. టీఎస్‌ఆర్‌టీసీకి బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో వాయిదాల పద్ధతిలో రెండు కోట్లు చెల్లించారు.
ఈ కేసులో బకాయిలన్నీ నెల రోజుల్లోగా చెల్లించాలని జీవన్ రెడ్డి కుటుంబానికి మార్చి 27న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బకాయిలు చెల్లించకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టీఎస్‌ఆర్టీసీని ఆదేశించారు. జీవన్ రెడ్డి కుటుంబం నెల రోజులలో బకాయిలు చెల్లించలేదు. ఇప్పటి వరకు రూ.2.51 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఐదేళ్లలో బకాయిల చెల్లింపుల కోసం TSRTC 20కి పైగా నోటీసులు జారీ చేసిందని అధికారులు తెలిపారు.
“జీవన్ రెడ్డి కుటుంబం నుండి సరైన స్పందన లేకపోవడంతో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి టీఎస్‌ఆర్‌టీసీ భవనాన్ని స్వాధీనం చేసుకుంది. TSRTC అనేది ప్రజల సంస్థ. అద్దె బకాయిల విషయంలో కార్పొరేషన్ రాజీపడదు. నిబంధనల ప్రకారం అద్దె బకాయిలు వసూలు చేస్తున్నాం’’ అని టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.