నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య భౌతికకాయాన్ని భద్రపరిచారు. ఇవాళ రాత్రికి అమెరికా నుంచి ఆయన చిన్న కూతురు జ్యోతి రానున్నారు. రేపు నోముల స్వగ్రామమైన నకేరేకల్ మండలం పాలెం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదిలావుంటే.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోముల మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు. నోముల నర్సింహయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా నిలిచి పోతారని సీఎం అన్నారు. ఆయన మరణం టీఆర్‌ఎస్ పార్టీకి, నియోజక వర్గం ప్రజలకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నోముల నర్సింహ్మయ్య 1999,2004 లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో భువనగిరి ఎంపీగా సీపీఎం నుంచి ఓటమి చెందారు. తరువాత ఆయన 2013లో టీఆర్ఎస్ లో చేరారు. 2014లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు. అయితే, 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై ఘన విజయం సాధించి నోముల నర్సింహయ్య మరోమారు అసెంబ్లీలో అడుగుపెట్టారు.