ఆ రెండు జిల్లాల అభివృద్ధికి నోడల్‌ ఏజెన్సీ

Nodal agency for RR, Medchal-Malkajgiri. హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్

By Medi Samrat  Published on  3 April 2021 9:12 AM IST
ఆ రెండు జిల్లాల అభివృద్ధికి నోడల్‌ ఏజెన్సీ

హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, ఇతర ముఖ్య పట్టణాల్లో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణంతోపాటు, టౌన్ హాల్స్ నిర్మాణం, రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, పరిశుభ్రత వంటి మౌలిక వసతులను అభివృద్ధి పరచడం, సీవరేజీ డ్రైనేజీ, నాలాల మరమ్మత్తు, వరదనీరు, ముంపు, ట్రాఫిక్ వంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని సీఎం అన్నారు. ఈ దిశగా అనుసరించాల్సిన కార్యాచరణ కోసం ఆ రెండు జిల్లాల స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం కావాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలలో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారం, భవిష్యత్తు అవసరాలను అంచనా వేస్తూ మౌలిక వసతుల సమగ్రాభివృద్ధి కోసం ఏకీకృత విధానాన్ని అమలుపరచడం.. అనే అంశం మీద సీఎం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా పురోగమిస్తున్నది. నగరంలో భాగంగా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలు దిన దినాభివృద్ధి చెందుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను సమగ్రంగా అభివృద్ధి పరుచుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. హైదరాబాద్ నగరంతో పాటు సమ్మిళితాభివృద్ధిని కొనసాగించే విధంగా విస్తృత పరిధిలో ఒక సమీకృత విధానాన్ని రూపొందించుకోవాలి. ఇందుకు నిరంతరం పర్యవేక్షించేందుకు సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ జిల్లాల్లో నివసిస్తున్న ప్రజలకు హైద్రాబాద్ నగరంలో మాదిరి విద్య వైద్యం వంటి అన్నిరకాల సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తెవాలి. అందుకు ఏ నియోజకవర్గం పరిధిలో ఏ సమస్యలున్నాయో, వాటిని ఒక ప్రాజెక్టు రూపంలో స్థానిక ఎమ్మెల్యేలు తయారు చేసుకోవాలి.

మౌలిక వసతుల అభివృద్ధికి ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. వాటి పరిష్కారానికి నోడల్ అధికారి అధ్యక్షతన తరచూ సమావేశమవుతుండాలి. ఇందులో ఏఏ శాఖలు భాగస్వామ్యం కావాల్సివున్నవి? ఎంత ఖర్చు అవుతుంది? తదితర అంశాన్నింటిని ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి చర్చించాలి. నెలకోసారి ప్రజాప్రతినిధులు సీఎస్ తో క్రమం తప్పకుండా సమావేశం కావాలి. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు నోడల్ అధికారి సమీక్షించాలి. అందుకు సంబంధించిన నిధులను సమకూర్చడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నది అని సీఎం అన్నారు.

హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ విమానాశ్రయం వున్నది. అత్యద్భుతమైన వాతావరణ పరిస్థితులున్నాయి. మిషన్ భగీరథ తాగునీరు నిరంతరం అందుతున్నది. తాగునీటి అవసరాల కోసం అటు గోదావరి ఇటు కృష్ణా జలాలను నింపుకొనేందుకు అతిపెద్ద రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకుంటున్నం. ప్రజల ఆరోగ్య పరిరక్షణకోసం ఇప్పటికే జనాదరణ పొందిన బస్తీ దవాఖానాలను ఈ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలి. ప్రజల ఆహార అవసరాలను గుర్తించి వారికి పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు వంటి ఆహారాన్ని అందుబాటులోకి తెస్తూ గృహిణులకు అందుబాటులో ఉండే విధంగా విశాలమైన స్థలాలను ఎంపిక చేసి, వెజ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయాలి. నిరంతరం నాణ్యమైన విద్యుత్ ను అందుబాటులో ఉంచడం, పటిష్టంగా రోడ్ల నిర్మాణం, మురుగునీరు వంటి పారిశుధ్యాన్ని తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడడం, వరదల నివారణ ముంపు సమస్యలను అధిగమించడం వంటి పనులతోపాటు, రెవిన్యూ భూ రిజిష్ట్రేషన్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలను అన్వేషించాలి. తద్వారా ఈ రెండు జిల్లాలు భవిష్యత్తులో హైదరాబాద్ తో పోటీ పడుతు అభివృద్ది చెంది, శాటిలైట్ టౌన్ షిప్పుల నిర్మాణం వూపందుకుని అత్యంత సుందరంగా రూపుదిద్దుకుని, భవిష్యత్తులో హైదరాబాద్ ముఖ చిత్రాన్నిమరింత గుణాత్మకంగా మార్చివేయడం ఖాయం అని సీఎం అన్నారు.

ఇందులో భాగంగా షాద్ నగర్, పెద్ద అంబర్ పేట, ఇబ్రహీంపట్నం, జల్ పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకర్ పల్లి, తుక్కుగూడ, ఆమన్ గల్ వంటి మున్సిపాలిటీలు, బడంగ్ పేట్, బండ్లగూడ జాగీర్, మీర్ పేట్, జిల్లెలగూడ వంటి మున్సిపల్ కార్పొరేషన్లు మేడ్చల్ జిల్లా పరిధిలోని బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట వంటి మున్సిపల్ కార్పొరేషన్లు.., మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్ కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ వంటి మున్సిపాలిటీల అభివృద్దికి చర్యలు చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు.

ఈ ప్రాంతాలన్నీ హైద్రాబాద్ నగరంలో దాదాపు కలిసిపోయాయని, వివిధ ప్రాంతాలనుంచి జీవనోపాధి వెతుక్కుంటూ, ఉద్యోగాలనిమిత్తం వచ్చిన తెలంగాణ సహా ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిర పడుతున్న నేపథ్యంలో, భవిష్యత్తు తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రచించాలని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించిన నిధులను సమీకరించడం, నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసి నగరం నలువైపులా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం కీలకం అని సీఎం అన్నారు. అన్ని దిక్కుల్లో అన్ని రకాల పనులు సమాంతరంగా జరిగేలా చూడాలన్నారు. త్వరలో ఈ ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు సహా విద్య, వైద్యం, విద్యుత్తు శాఖ,మున్సిపల్ శాఖ, మిషన్ భగీరథ, తదితర మౌలిక వసతుల కల్పనలో భాగస్వామ్యం అయ్యే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.


Next Story