తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. వైద్య కళాశాలలు మినహా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రకటన చేశారు.
అయితే ఆన్‌లైన్ క్లాసులు మాత్రం యథావిధంగా కొనసాగుతాయని అన్నారు. విద్యాసంస్థల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
కాగా, తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 412పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 1674కి చేరింది.