తెలంగాణలో ఐదో తరగతి వరకు బడులు లేనట్లే..!
No Schools From 1st to 5th class in Telangana. కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన స్కూళ్లను తెరిచే విషయంలో
By Medi Samrat Published on 24 Dec 2020 11:47 AM ISTకరోనా మహమ్మారి కారణంగా మూతపడిన స్కూళ్లను తెరిచే విషయంలో తెలంగాణ విద్యాశాఖ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విద్యా సంవత్సరం(2020-21)లో 1 నుంచి 5 తరగతులకు బడులు తెరవకూడదని నిర్ణయించింది. పాఠశాలలు తెరిచినా.. పిల్లలను తల్లిదండ్రులు సూళ్లకు పంపించేందుకు అంగీకరించకపోవచ్చునని భావిస్తోండడం కూడా దీనికి ఓ కారణంగా చెప్పవచ్చు.
ఒక వేళ పాఠశాలలను తెరిచినా కూడా పిల్లలు భౌతిక దూరం పాటించడం అసాధ్యం, ఒకవేళ పిల్లలు ఈ వైరస్ బారిన పడితే.. ఇంట్లోని పెద్దలకు, వృద్దులకు ప్రమాదం ఉండొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే 5వ తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం తరగతి గది భోదన వద్దని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఒకటి నుంచి ఐదు తరగతులు చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో 11.36 లక్షల మంది ఉండగా, ప్రైవేటు పాఠశాలల్లో ఈ సంఖ్య 15 లక్షల వరకు ఉందని అంచనా. ఇక, నర్సరీ-యూకేజీ మధ్య చదువుతున్న వారు ఆరేడు లక్షల మంది వరకు ఉంటారు. వీరందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆరు నుంచి 8 తరగతులకు పరిస్థితులను బట్టి ప్రత్యక్ష బోధనపై నిర్ణయం తీసుకుంటారు. 9-10 తరగతుల విద్యార్థులకు మాత్రం కనీసం 90 రోజులు, గరిష్ఠంగా 120 రోజులపాటు ప్రత్యక్ష బోధన అందించాలని భావిస్తున్నారు.