హైదరాబాద్: ఫార్ములా ఈ -రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరగాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు నిర్ణయించుకున్నారు. ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ ప్రసన్న వరాలే ధర్మాసనం విచారణ చేసింది.
సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ క్యాబినెట్ ఆమోదం లేకుండా అంతర్జాతీయ ఏజెన్సీకి రూ. 55 కోట్లను బదిలీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫార్ములా ఇ రేస్ కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ, ఫెడరల్ ఏజెన్సీ-ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును కొనసాగిస్తాయి. అవసరమైతే కేటీఆర్ అరెస్ట్ తప్పదని సమాచారం.
అంతకుముందు తనపై దాఖలైన ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో కేటీఆర్ లీగల్ టీమ్ సుప్రీం కోర్టు తలుపు తట్టింది. ఏజెన్సీ ఎదుట హాజరుకావాలని ఏసీబీ కేటీఆర్‌కు రెండోసారి నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. ఇది అతని రెండవ నోటీసు, మొదటి నోటీసు జనవరి 9వ తేదీన వచ్చింది. అంతేకాకుండా జనవరి 16వ తేదీ (గురువారం) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు కేటీఆర్ హాజరుకానున్నారు.