రాష్ట్రంలో యూరియా కొరత లేదు: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, అక్టోబర్ నుండి డిసెంబర్ 31 వరకు కొనసాగుతున్న యాసంగి సీజన్‌లో రైతులకు...
By - అంజి |
రాష్ట్రంలో యూరియా కొరత లేదు: మంత్రి తుమ్మల
హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, అక్టోబర్ నుండి డిసెంబర్ 31 వరకు కొనసాగుతున్న యాసంగి సీజన్‌లో రైతులకు 4.04 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎమ్‌టి) సరఫరా చేశామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇది ఎనిమిదేళ్ల రికార్డు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలకు సమాధానమిస్తూ నాగేశ్వరరావు కౌన్సిల్‌కు సమాచారం అందిస్తూ.. డిసెంబర్ నెలకు కేంద్ర కేటాయింపులు 5.60 LMTగా ఉన్నాయని, అయితే రాష్ట్రం ఇప్పటికే 5.78 LMTల యూరియాను తెప్పించుకోగలిగిందని తెలిపారు. "రైతుల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది" అని ఆయన అన్నారు, కొరత ఉందనే ప్రతిపక్ష వాదనలను తోసిపుచ్చారు.
రాష్ట్రంలోని 12,000 కేంద్రాలలో ఎక్కడో 2,3 సెంటర్లలో ఉన్న క్యూలైన్లు చూపించి రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, "రాజకీయ లాభం కోసం" క్యూలను అతిశయోక్తి చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో క్యూలలో రైతు మరణాలు వంటి తీవ్రమైన కొరతలను ఆయన గుర్తుచేసుకున్నారు.
రైతులు అక్కడక్కడ షాప్ ల ముందూ నిల్చున్న సందర్భాలను చూపి యూరియా కొరత అని ప్రచారం చేసి మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని అనుకుంటే రైతులు క్షమించబోరని అన్నారు. రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా యాప్ ద్వారా ఎరువుల సరఫరాను అమలు చేస్తున్నామని, చిన్న, సన్నకారు రైతులు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు. ఈ యాప్ ద్వారా 1.18 లక్షల మంది రైతులు 3.36 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేశారని మంత్రి తెలిపారు.