'కేసీఆర్‌ సమున్నత సంకల్పమమే.. TS IPASS'.. కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

రాష్ట్రాన్ని పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా మార్చాలన్న సమున్నత సంకల్పంతో కేసీఆర్.. రూపకల్పన చేసిన TS IPASS విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని...

By -  అంజి
Published on : 16 Jan 2026 4:38 PM IST

NITI Aayog, TS iPass, Telangana, KTR

కేసీఆర్‌ సమున్నత సంకల్పమమే.. TS IPASS: కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా మార్చాలన్న సమున్నత సంకల్పంతో కేసీఆర్.. రూపకల్పన చేసిన TS IPASS విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని నీతి ఆయోగ్ తాజా నివేదికలో ప్రశంసించడం యావత్ తెలంగాణకు గర్వకారణమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణను పదేళ్ల కాలంలోనే దేశానికే పారిశ్రామిక దిక్సూచిగా మార్చడంలో TS IPASS పోషించిన పాత్ర అత్యంత కీలకమని, జాతీయ స్థాయిలో అందరికీ అనుసరణీయమని కేంద్ర సంస్థ పేర్కొందని తెలిపిన కేటీఆర్‌.. ఇది కేసిఆర్ దార్శనికతకు నిలువెత్తు నిదర్శనమన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో భారీ పరిశ్రమలకు తోడు, ఎంఎస్ఏంఈ విభాగంలో 2.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 25లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించామన్నారు. ఇది దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అని కేటీఆర్‌ అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సవాలక్ష ప్రతిబంధకాలను సమూలంగా, శాశ్వతంగా రూపుమాపి సింగిల్ విండో ద్వారా అని అనుమతులు అందించిన ఘనత బీ ఆర్ ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

కేవలం 15 నుండి 30 రోజుల్లోనే అన్ని పర్మిషన్స్ ఇవ్వడంతోపాటు అవినీతికి, ఏమాత్రం తావులేని - అత్యంత పారదర్శక పాలసీని రూపకల్పన చేయడమే కాదు.. అదే చిత్తశుద్ధితో దశాబ్దకాలంపాటు విజయవంతంగా అమలు అమలుచేయడం వల్లే ఈ ప్రతిష్టాత్మక ఫలితాలు, జాతీయస్థాయి గుర్తింపు సాధ్యమైందన్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థల నుండి సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల వరకూ అందరూ తెలంగాణకు క్యూకట్టేలా పెట్టుబడిదారుల్లో కొండంత విశ్వాసాన్ని కల్పించిన విప్లవాత్మక విధానం తీసుకొచ్చి పదేళ్లు దాటినా నేటికి TS IPASS ప్రతిష్ట నలుదిశలా మారుమోగుతూనే ఉందన్నారు.

Next Story