తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్నది అబద్ధం : నిర్మలా సీతారామన్

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదంటూ అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతి పక్షంలో ఉన్న బీ.ఆర్.ఎస్. కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  30 July 2024 8:05 PM IST
తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్నది అబద్ధం : నిర్మలా సీతారామన్

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదంటూ అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతి పక్షంలో ఉన్న బీ.ఆర్.ఎస్. కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా తెలంగాణ సీఎం ప్రధానమంత్రి అధ్యక్షన సాగిన నీతి ఆయోగ్ మీటింగ్ కు కూడా హాజరవ్వలేదు. బీజేపీతో కూటమిలో లేని రాష్ట్ర ప్రభుత్వాలకు కావాలనే నిధులు కేతాయించలేదనే విమర్శలు ఎదురవుతున్న వేళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ స్పందించారు. తెలంగాణకు నిధులు కేటాయించలేదంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కూడా భారీగానే నిధులు కేటాయించామని చెప్పారు.

నిర్మలా సీతారామన్ లోక్ సభలో స్పందిస్తూ.. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలకు పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్కులు కేటాయించామని.. గ్రీన్ ఫీల్డ్ పార్కులకు రూ.500 కోట్లు కేటాయించామని, బ్రౌన్ ఫీల్డ్ పార్కులకు రూ.200 కోట్లు కేటాయించామన్నారు . బెంగాల్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు ఇచ్చామని, తెలంగాణ, మహారాష్ట్ర రైల్వే డబ్లింగ్ పనులకు నిధులు కేటాయించామన్నారు.ఏపీ, తెలంగాణలో మోటుమర్రి-విష్ణుపురం సెక్షన్లలో రైల్వే డబ్లింగ్ పనులకు, మడికేర్, మేడ్చల్, మహబూబ్ నగర్, డోన్ మార్గంలో డబ్లింగ్ పనులకు, భద్రాచలం, డోర్నకల్ సెక్షన్లలో రైల్వే పనులకు మొత్తం రూ.12,334 కోట్ల నిధులు ఇచ్చామన్నారు. తాము ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చలేదని తేల్చి చెప్పారు. స్థిరత్వం, ప్రజాశ్రేయస్సు విధానాలను తీసుకున్నామని.. వికసిత్ భారత్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ధ్యేయమన్నారు.

Next Story