తెలుగు రాష్ట్రాల్లో 60 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు.. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. అమర బంధు మిత్రుల సంఘం, పౌర హక్కుల సంఘం నాయకుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
By అంజి Published on 2 Oct 2023 4:52 AM GMTతెలుగు రాష్ట్రాల్లో 60 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు.. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. 60కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఏపీ, తెలంగాణలోని అమర బంధు మిత్రుల సంఘం, పౌర హక్కుల సంఘం నాయకుల ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే అనుమానంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం. హైదరాబాద్ సిటీలోని అమరుల బంధు మిత్రులు సంఘం కార్యకర్త ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రాలో ఆరు చోట్ల ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో భవాని, న్యాయవాది సురేశ్ ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. అటు నెల్లూరులో కూడా ఎన్ఐఏ దాడులు నిర్వహించారు.
హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నాయకులపై నిఘా పెట్టి అనంతరం వారి ఇంటిలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఉస్మాన్ సాహెబ్ పేటలోని నివాసం ఉంటున్న ఏపీసీఎల్‌సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసంపై ఎన్ఐఎ దాడులు చేశారు. గత రెండు దశాబ్దాలు పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా ఎల్లంకి వెంక టేశ్వర్లు పని చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు, ఉభయ తెలుగు రాష్ట్రాల పౌర హక్కుల సంఘం నాయకులుగా చెలామణి అవుతున్నారు. తిరుపతిలో నివాసం ఉంటున్న న్యాయవాది క్రాంతి చైతన్య (తిరుపతి) ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఉదయం 6 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే నెల్లూరులో అరుణ ఇంట్లో, గుంటూరులో డాక్టర్ రాజారావు ఇంట్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు ఇంటిపై, సంతమాగులూరులో ఓరు శ్రీనివాసరావు ఇంట్లో, రాజమండ్రి బొమ్మెరులో పౌర హక్కుల నేత నాజర్ ఇంట్లో, హార్లిక్స్ ప్యాక్టరీలో ఉద్యోగి కోనాల లాజర్ ఇంట్లో.. శ్రీకాకుళంలో కెఎన్.పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిస్కా కృష్ణయ్య ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఈరోజు తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు. అనంతపురంలో ఉపాధ్యాయుడు శ్రీరాములు ఇంట్లోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కావలి బాలయ్య ఇంటిలో సోదాలు జరుగుతున్నాయి. గతంలో బాంబు పేలుళ్ల కేసులో బాలయ్య కుమార్తె పద్మ, అల్లుడు శేఖర్ నిందితులుగా ఉన్నారు.