హైదరాబాద్‌కు బంగ్లాదేశ్ అమ్మాయిలను తరలించారు.. చివరికి..!

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెల్లడించింది.

By Medi Samrat  Published on  8 Nov 2024 2:16 PM IST
హైదరాబాద్‌కు బంగ్లాదేశ్ అమ్మాయిలను తరలించారు.. చివరికి..!

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. బంగ్లాదేశ్ బాలికలను హైదరాబాద్‌కు తరలించి మానవ అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్న ఆరుగురు వ్యక్తులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 2019లో ఈ కేసుకు సంబంధించి విచారణ మొదలైంది. బాలికలను తప్పుడు వాగ్దానాలతో బంగ్లాదేశ్ నుండి హైదరాబాద్ కు తీసుకుని వచ్చారు.

హైదరాబాద్‌లో బంగ్లాదేశ్ బాలికలను బలవంతంగా వ్యభిచారం చేయించారు. మొహమ్మద్ యూసుఫ్ ఖాన్, అతని భార్య బితీ బేగం, సోజిబ్, రూహుల్ అమీన్ ధాలీ, మహ్మద్ అబ్దుల్ సలామ్ (అలియాస్ కౌన్లా జస్టిన్), షీలా జస్టిన్ (అలియాస్ షియులీ ఖాతున్) మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని బంగ్లాదేశ్‌కు చెందిన యువతులను లక్ష్యంగా చేసుకుని, ఇక్కడికి రాగానే వారిని వ్యభిచారంలోకి దింపింది ఈ బృందం.

హైదరాబాద్‌లోని ఛత్రినాక పోలీసులు తొలుత 2019 ఆగస్టులో ఉప్పుగూడలోని కందికల్ గేట్ ప్రాంతంలోని ఓ ఇంటి నుంచి ఐదుగురు బాలికలను రక్షించి ఈ నెట్‌వర్క్‌ను బయట పెట్టారు. NIA ఆ తర్వాత విచారణను మొదలుపెట్టింది. బంగ్లాదేశ్ బాలికలను హైదరాబాద్‌కు అక్రమ రవాణా చేసిన కేసులో మార్చి 2020 నాటికి నలుగురిపై ఛార్జిషీట్, ఆగస్టు 2020 నాటికి మిగిలిన ఇద్దరికి అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేస్తూ, దర్యాప్తు బాధ్యతను NIA తీసుకుంది. NIA దర్యాప్తులో అక్రమ రవాణా నెట్‌వర్క్‌ కు సంబంధించి పలు విషయాలు బయట పడ్డాయి. నిందితులలో ఒకరైన రుహుల్ అమీన్ ధాలీ పశ్చిమ బెంగాల్‌లో పట్టుబడ్డారు. మిగతా వారిని తెలంగాణలో అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.24,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 18 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Next Story