సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటుపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నోటీసులు అందజేసింది. నిమ్జ్ ఏర్పాటుకు ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చారో వివరణ ఇవ్వాలని ఎన్జీటీ కోరింది.
పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ న్యాల్‌కల్ మండలం మామిడ్గి గ్రామానికి చెందిన పటేల్ రాజురెడ్డితోపాటు పలువురు రైతులు ఎన్‌జీటీలో నెల రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. నిమ్జ్ నుండి వెలువడే కాలుష్యం చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రజలు, జంతువులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం నిమ్జ్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మే 2022లో నిమ్జ్‌కి ఆమోదం తెలిపింది. నిమ్జ్‌ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC) రెండు మండలాల్లో 12,635 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3,095 కోట్లు. ఇది అమలులోకి వచ్చిన తర్వాత, నిమ్జ్ 2.6 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఆటోమొబైల్స్, మెటల్, ఎలక్రిక్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్, చేనేత, జౌళి పరిశ్రమలను ఈ పారిశ్రామికవాడలో నెలకొల్పనున్నారు.