సికింద్రాబాద్‌ నుంచి మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఈ రూట్‌లోనే.!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలను కలుపుతూ పరుగులు

By అంజి  Published on  11 April 2023 5:00 PM IST
Vande Bharat train, Bengaluru, Hyderabad, National news

సికింద్రాబాద్‌ నుంచి మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఈ రూట్‌లోనే.!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలను కలుపుతూ పరుగులు పెడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది జనవరి 14న తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభమైంది. ఇది సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య నడుస్తోంది. అలాగే ఏప్రిల్‌ 8వ తేదీన సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి రెండో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ రెండు రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌ నుంచి మరో వందే భారత్‌ రైలు పట్టాలెక్కనుందని సమాచారం.

హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య ట్రైన్‌ను నడపనున్నట్లు సమాచారం. బెంగళూరు, హైదరాబాద్ మధ్య తరచుగా ప్రయాణించే వారికి ఇది శుభవార్త కానుంది. ఐటీ రంగాలకు ప్రసిద్ధి చెందిన రెండు నగరాల మధ్య కొత్త వందే భారత్ రైలును కేటాయించే అవకాశం ఉంది. సెమీ హైస్పీడ్ రైలు బెంగళూరు, సికింద్రాబాద్ మధ్య నడుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ గత వారం తన పర్యటనలో తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులతో చెప్పినట్లు తెలిసింది. ట్రయల్స్‌ తేదీ వంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ వార్తల తర్వాత త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని జాతీయ మీడియా పేర్కొంది. కర్ణాటక, తెలంగాణ రెండు అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్నాయి. కర్ణాటకలో మే 10 న ఓటింగ్‌ జరగనుంది. మే 13 న కౌంటింగ్ జరుగుతుంది.

గత ఏడాది నవంబర్‌లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన మైసూరు - బెంగళూరు - చెన్నై మార్గంలో దక్షిణ భారతదేశానికి మొదటి వందే భారత్ రైలు వచ్చింది. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బలి మధ్య నైరుతి రైల్వే (SWR) మరో వందే భారత్ రైలును ప్రతిపాదించింది. తెలంగాణకు ఇది మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్. కాచిగూడ-బెంగళూరు మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తున్నది, సికింద్రాబాద్ నుండి తిరుపతి, పూణే వరకు దక్షిణ భారతదేశంలో సేవలందించేందుకు మరో రెండు రైళ్లను కేటాయించారు.

ఈ ఏడాది చివరి నాటికి 75 వందేభారత్ రైళ్లను నడపాలని, వచ్చే మూడేళ్లలో 400 రైళ్లను నడపాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సెమీ-హై స్పీడ్, గరిష్టంగా 160 kmph వేగంతో నడుస్తాయి. ఈ రైళ్లు మేక్-ఇన్-ఇండియా చొరవ కింద తయారు చేయబడ్డాయి.

Next Story