నేటి నుంచి అమల్లోకి పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు
New Registration Charges From Today In Telangana. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన భూముల రేటు, కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీల అమలుకు స్టాంపులు,
By Medi Samrat Published on 22 July 2021 9:28 AM ISTతెలంగాణ రాష్ట్రంలో పెరిగిన భూముల రేటు, కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీల అమలుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో.. నేటి నుంచి పెరిగిన విలువ, ఛార్జీల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. ఈ మేరకు అధికారులు 'కార్డ్' సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. కొత్త విధానం అమలుపై అధికారులు సమీక్ష జరిపారు. తొలి రోజు నుండి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సబ్‌రిజిస్ట్రార్లను ఆదేశించారు.
ఇదివరకే ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నవారు.. పెరిగిన ఛార్జీలు చెల్లించేందుకు ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్లాటు నమోదు చేసుకున్న వారు వారి సర్వే నంబరును బట్టి పెరిగిన మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే స్లాటు బుక్ చేసుకున్న వారు 30,891 మంది ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర భూములు, స్థలాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్ల కొత్త విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులను బుధవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు గురువారం నుంచి తహసీల్దారు- సంయుక్త సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
ఇక ఆస్తుల విక్రయానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5 శాతం కాగా.. గ్రామ పంచాయతీల పరిధిలో ట్రాన్స్‌ఫర్ డ్యూటీ లేకున్నా స్టాంపు డ్యూటీ 5.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 2 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీయేతర ప్రాంతాల్లో 5.5 శాతం, స్టాంపు డ్యూటీ, 1.5 శాతం, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, 0.5 శాతంగా రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు.