నేటి నుండి కొత్త రేషన్ కార్డులు..!

New Ration Cards In Telangana. కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తూ ఉండగా వారికి ప్రభుత్వం ఓ మంచి

By Medi Samrat  Published on  26 July 2021 5:20 AM GMT
నేటి నుండి కొత్త రేషన్ కార్డులు..!

కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తూ ఉండగా వారికి ప్రభుత్వం ఓ మంచి వార్త తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు నేటి నుండి మంజూరు చేయనున్నారు. అర్హులైన పేదలకు రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. 3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులను పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు పౌర సరఫరాల శాఖ సమాచారం అందించింది. జూలై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం జరుగనుంది. కొత్త రేషన్‌ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్‌ బియ్యం అందజేయనున్నారు.

జూన్ నెలలో కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఆ సమయంలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య 4,46,169గా ఉండగా, వీటిని అన్ని దశల్లో పరిశీలన చేశారు. డూప్లికేట్‌లు లేకుండా, ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి అన్ని కోణాల నుంచి పరిశీలించారు. వివిధ అంశాల్లో పరిశీలించిన తర్వాత 3,09,083 మందిని అర్హులుగా గుర్తించారు. అధికంగా హైదరాబాద్‌లో 56,064 మందిని అర్హులుగా ఉన్నారు.

లబ్ధిదారులకు ప్రస్తుతం కొత్త కార్డు మంజూరు చేస్తున్నట్లుగా ధ్రువీకరణ పత్రం అందిస్తామన్నారు. త్వరలోనే ప్రత్యేక నమూనాతో కూడిన కార్డులను ముద్రించి ఇస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేశామని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు అందిస్తామని వెల్లడించారు.


Next Story
Share it