తెలంగాణలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి. పెండింగ్ బకాయిలు చెల్లించాలన్న తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆస్పత్రుల యాజమాన్యాలు తెలిపాయి. రూ.1,300 కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయని.. దీనితో చిన్న, మధ్యస్థాయి ఆస్పత్రులను మూేసేస పరిస్థితి ఉందని పేర్కొన్నాయి.
కాగా ఇవాళ (31వ తేదీ) అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సేవలను నిలిపివేసేందుకు నెట్‌వర్క్ ఆస్పత్రులు సిద్ధమయ్యాయి. బకాయిలు చెల్లించకుంటే ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తామని ఈ నెల 21వ తేదీనే ‘తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్‌హెచ్‌ఏ)’ ఆరోగ్యశ్రీ సీఈవోకు లేఖ రాసిందని గుర్తు చేశాయి. కానీ ఎటువంటి స్పందన రాలేదని, చర్చలకైనా ఆహ్వానించలేదని పేర్కొన్నాయి. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో డయాలసిస్, ఎమర్జెన్సీ వైద్య సేవలు మినహా మిగతా ఆరోగ్యశ్రీ సేవలన్నీ నిలిపివేస్తున్నట్టు తెలిపాయి. కాగా బిల్లుల పెండింగ్‌తో చిన్న, మధ్యస్థాయి ఆసుపత్రులు మూసివేసే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.