మహబూబాబాద్‌: నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర ఆదివారం నాడు నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది.

By అంజి  Published on  26 Feb 2023 2:45 PM IST
Navajivan Express , Mahabubabad, accident

నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర ఆదివారంనాడు నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. లోకోపైలట్‌ అప్రమత్తం కావడంతో రైలు ప్రయాణికులు తృటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రైలు అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలును ఆపడంతో లోకో పైలట్ సత్వర చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అధికారుల విచారణలో బ్రేక్‌ లైనర్‌లు జామ్‌ కావడంతో పొగలు వచ్చినట్లు తేలింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే దిగి అక్కడి నుంచి పరుగులు తీశారు.

అంతరాయం కారణంగా ఆ ప్రాంతంలోని ఇతర రైలు సర్వీసులకు చాలా ఆలస్యం ఏర్పడింది. అదృష్టవశాత్తూ రైలుకు ఎలాంటి నష్టం జరగలేదు. ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఘటేసర్‌ - బీబీనగర్‌ మధ్యలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో కూడా ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ట్రాక్‌ను పునరుద్ధరించడంతో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి.

Next Story