నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో భారీగా ఓటింగ్ నమోదయ్యింది. నియోజకవర్గ ఓటర్లు చైతన్యంతో 88 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగిసినా.. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారంటే ఏ స్థాయిలో ఓటింగ్ నమోదయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 10 గంటల వరకు మందకొడిగా సాగినా ఆ తరువాత ఊపందుకుంది. 5 గంటల తరువాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుదీరి కనిపించారు. దీంతో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్నిచోట్ల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఇక సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను, కంట్రోల్ యూనిట్లను, వీవీప్యాట్లను పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో స్విచ్ ఆఫ్ చేశారు. కేటాయించిన రూట్లలో రూట్ ఆఫీసర్లు, సెక్టోరియల్ ఆఫీసర్లు పోలీస్ బందోబస్తు నడుమ నల్గొండ జిల్లా కేంద్రంలోని వేర్ హౌసింగ్ గౌడౌన్స్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు మే 2న జరుగనుండగా.. అదే రోజు ఫలితాన్ని ప్రకటిస్తారు.