నోముల నర్సింహయ్య మృతితో అనివార్యమైన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం నుండే పోలింగ్ ప్రారంభం కాగా.. 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఎండ తీవ్రత అదికంగా ఉండటంతో అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, మంచినీటి సౌకర్యం కల్పించారు.
కరోనా వ్యాప్తి నేఫథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు. మాస్కు ధరించిన వారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. ఇక కొవిడ్ రోగులకు సాయంత్రం 6 గంటలకు ఓటేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. పోలీసులు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల చేతులకై గ్లౌసులు పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.