ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనమే కొనసాగుతోంది : మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు
Nagam Janardhan Reddy Fires On CM KCR. కేసీఆర్ ప్రభుత్వ పనితీరు చూస్తుంటే బాధ కలుగుతుందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
By Medi Samrat Published on 3 Sep 2021 11:01 AM GMTకేసీఆర్ ప్రభుత్వ పనితీరు చూస్తుంటే బాధ కలుగుతుందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలు దోపిడీ చేస్తుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదని.. నీటిపారుదల అధికారులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. పనికిమాలిన అధికారులు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్ట్ జలవిద్యుత్ కోసమే అంటూ అధికారులు చెప్పడం సిగ్గుచేటని.. కృష్ణా నదిలో 574.6 టీఎంసీల వాటా తెలంగాణకు ఉందని వివరించారు.
కేసీఆర్‌కు లిఫ్ట్ ప్రాజెక్ట్ ల పైనే దృష్టి.. లిఫ్టులు కట్టాలి, కమీషన్లు తీసుకోవాలి అనేదే ధ్యాసగా ఉందని.. రాష్ట్రంలో ప్రాజెక్ట్ ల పేరుతో దోపిడీ జరుగుతోందని ఫైర్ అయ్యారు. కేఆర్ఎంబీ సమావేశంలో ఆంధ్రా ప్రభుత్వం అక్రమ ప్రాజెక్ట్ ల గురించి ఎందుకు మాట్లాడలేదని.. అక్రమ ప్రాజెక్ట్ లపై సుప్రీంకు వెళ్లాలని కేసీఆర్ కు ఎన్నిసార్లు లేఖ రాసినా పట్టించుకోరని మండిపడ్డారు. ఒక బేసిన్ నీళ్లు మరో బేసిన్ కు తీసుకెళ్లేందుకు చట్టం ఒప్పుకోదని.. ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనమే కొనసాగుతోందని అన్నారు.
కేసీఆర్ ఆంధ్ర నాయకులకు, కాంట్రాక్టర్లకు దాసోహం అంటున్నారని.. ప్రతిరోజూ పోతిరెడ్డిపాడు నుంచి 7టీఎంసీల నీళ్లు ఆంధ్రకు పోతున్నాయని అన్నారు. కేసీఆర్ ఢిల్లీలో మోదీ, అమిత్ షా లను కలుస్తున్నది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని.. కేసీఆర్ స్వంత ప్రయోజనాల కోసమే డిల్లీ టూర్ అని విమర్శించారు. సంగమేశ్వర ప్రాజెక్ట్ పుట్టిందే ప్రగతి భవన్ లోనని.. దానికి పేరు పెట్టిందే కేసీఆర్ అని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సంగమేశ్వర పనులను ఆపాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ లే ఉన్నాయని.. కేసీఆర్ కట్టినవి ఏమున్నాయని.. కాళేశ్వరం నుంచి ఒక్క ఏకరాకన్నా నీళ్లు పారినవా అని ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వల్ల ఇద్దరు కాంట్రాక్టర్లు దేశంలోనే సంపన్నులు అయ్యారని.. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి పైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.