నల్గొండ జిల్లాలో పంటపొలాల్లో ప్రత్యక్షమైన ఓ డెమో హెలికాప్టర్ కలకలం రేపింది. శాలిగౌరారం మండలం ఆకారం గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో ఆదివారం సాయంత్రం హెలికాప్టర్ దిగింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా దాడులకు పాల్పడుతున్నారంటూ ఇటీవల వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రజలు భయపడ్డారు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్‌ఐ సతీష్ అక్కడకు చేరుకుని హెలికాప్టర్‌ను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. డెమో హెలికాప్ట్ ఐదు అడుగుల వెడల్పు, ఐదు అడుగుల పొడవు, సుమారు 15 కేజీల బరువు ఉందని ఎస్సై వెల్లడించారు. దానిపై 76 అనే సంఖ్య రాసి ఉందని చెప్పారు. హెలికాప్టర్‌లో సీసీ కెమెరాలు, ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్, జీపీఎస్ సిస్టమ్, బ్యాటరీలను గుర్తించామని చెప్పారు. హెలికాప్టర్ రెక్కపై FL 216020220415099 అనే నెంబర్ రాసి ఉందని ఎస్సై వెల్లడించారు.
కాకినాడ నుంచి గుజరాత్ వరకు చేపట్టబోయే గ్యాస్ పైప్ లైన్ కోసం సర్వే చేస్తుండగా డ్రోన్ కూలిపోయినట్లు తెలిసింది. డ్రోన్ తమ కంపెనీకే చెందినదంటూ తుషార్, బలిజ జగదీష్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం ఉదయం 11:20 గంటలకు డ్రోన్ సిగ్నల్ కట్ అయిందని పోలీసులకు వివరాలు ఇచ్చారు. సర్వేకు సంబంధించిన అనుమతి పత్రాలను పోలీసులకు అందజేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.