మునుగోడుకు కదిలిన అదనపు బలగాలు
Munugode Bypoll Update. మునుగోడుకు మరిన్ని కేంద్ర భద్రతా బలగాలు వస్తున్నాయి.
By Medi Samrat Published on 1 Nov 2022 3:00 PM GMTమునుగోడుకు మరిన్ని కేంద్ర భద్రతా బలగాలు వస్తున్నాయి. ఇప్పటికే సుమారు 3,300 మంది మునుగోడులో మోహరించగా తాజాగా జరిగిన హింసాత్మక ఘటనలతో మరిన్ని బలగాలు రానున్నాయి. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు అదనపు బలగాలను తరలించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. హింసాత్మక సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాల్సిందిగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది. ఘర్షణలు జరిగే అవకాశం ఉందని అంచనా వేసిన ఎన్నికల సంఘం పోలింగ్ ప్రక్రియ ముగిసేంతవరకూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఎలక్షన్ కమిషన్ తరఫున జనరల్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ అబ్జర్వర్లు ఉన్నప్పటికీ, రాష్ట్ర పోలీసు బలగాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
నేడు మునుగోడు మండలం పలివెల వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై కొందరు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. తన కాన్వాయ్‌పై దుండగులు రాళ్లతో దాడి చేసినప్పుడు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోయారని ఈటల పోలీసులపై మండిపడ్డారు. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అదే సమయంలో బీజేపీ శ్రేణుల దాడిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ జగదీశ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు.